ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఫ్యామిలీలో వారసత్వ పోరు రాజుకుంది. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న బైరెడ్డి.. తొలుత టీడీపీతో రాజకీయ అరంగే ట్రం ప్రారంభించారు. తర్వాత.. కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి తొలినాళ్లలో మిత్రుడిగా ఉన్నప్పటికీ.. తర్వాత.. ఆయనను బహిరంగంగానే విభేదించారు. ఇక, రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపించారు.
హైదరాబాద్-కర్నూలు కేంద్రాలుగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ.. బైరెడ్డి అప్పట్లో దీక్షకు దిగారు. అప్పటి కిరణ్ కుమార్ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టి జైల్లోకి నెట్టింది. సరిగ్గా ఈ సమయంలో బైరెడ్డి కుమార్తె ప్రస్తుత ఎంపీ భైరెడ్డి శబరి రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. కొన్నాళ్లకు సోదరుడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ కూడా రాజకీయ బాటపట్టారు. అయితే.. ఈ అక్కా తమ్ముళ్లు చెరో దారిని ఎంచుకున్నారు. శబరి.. బీజేపీలో చేరి.. రాజకీయాలు చేశారు.
ఇదేసమయంలో సిద్ధార్థ.. వైసీపీలో చేరి పదవులు కూడా దక్కించుకున్నారు. గత వైసీపీ హయాంలో సిద్ధా ర్థ రెడ్డి `శాప్`(ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాదికార సంస్థ)కు చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన హయాంలో జరిగిన `ఆడుదాం ఆంధ్ర`లో అవినీతిపై కూటమి సర్కారు.. విచారణ చేయిస్తోంది. ఇక, శబరి విషయానికి వస్తే.. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వరకు.. బీజేపీలోనే ఉన్నారు. అయితే.. నామినేషన్ల సమయంలో అనూహ్యంగా టీడీపీ ఆమెకు కర్నూలు ఎంపీ టికెట్‌ను ఖరారు చేయడంతో రాత్రికి రాత్రి టీడీపీ కండువా మార్చుకున్నారు.
కూటమి హవాలో శబరి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు శబరి ఏమంటున్నారంటే.. బైరెడ్డి ఫ్యామిలీ రాజకీయ వారసత్వం తనదేనని.. సిద్ధార్థరెడ్డికి బైరెడ్డి వారసత్వం రాబోదని వ్యాఖ్యానించారు. ఆయన బైరెడ్డి వారసుడిగా రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇక నుంచి సిద్ధార్థగానే రాజకీయాలు వెలగబెట్టుకోవాలని సూచించారు. తన తండ్రి పేరును వాడుకుని రాజకీయంగా ఎదిగిన వాడు.. ఇప్పుడు తన తండ్రినే దూషిస్తున్నాడని.. ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి రాజకీయ వారసత్వం తనకే దక్కుతుందన్నారు. కాగా.. ఈ విషయంపై రాజశేఖరరెడ్డి మౌనంగా ఉన్నారు.