పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం చేతులెత్తేసిందని, ఇకపై పోలవరం ఖర్చు మొదలు నిర్వాసితుల పునరావాసం వరకు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. గతంలో పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాల మొత్తం 20 వేల కోట్ల రూపాయలకే కేంద్రం ఆమోదం తెలిపిందని, మిగతా ఖర్చంతా రాష్ట్రానిదేనని కేంద్రం పలుమార్లు వెల్లడించింది. అయితే, వైసీపీ నేతలు మాత్రం…ఈ విషయాన్ని మసిపూసి మారేడుగాయ చేసి…పోలవరంపై కేంద్రానిదే ఆలస్యమని, నిధులు విడుదల చేయడం లేదని సాకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రాజ్యసభ సాక్షిగా పోలవరంపై జగన్ సర్కార్ గుట్టు రట్టయింది. పోలవరానికి తమకూ సంబంధం లేదంటూ కేంద్రం తాజాగా తేల్చేసింది. పోలవరంపై సవరించిన డీపీఆర్ అనుమతుల కోసం తమ దగ్గర వీపీ పెండింగ్లో లేవని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి షెకావత్ బదులివ్వడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లయింది. 2011-19లోనే సవరించిన అంచనాలకు తాము ఆమోదం తెలిపామని, వైసీపీ అసలు డీపీఆర్ సమర్పించలేదని షెకావత్ తెలిపారు.
ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం 54 వేల కోట్లు రూపాయలు ఆమోదించాలని వైసీపీ ఎంపీలు కోరారు. వాటిని ఆమోదించి ఆర్థికశాఖకు పంపుతామని కేంద్రమంత్రి చెప్పినట్టు వైసీపీ ఎంపీలు ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా కేంద్రం సమాధానంతో వైసీపీది గోబెల్స్ ప్రచారం అని తేలిపోయింది. ఒక్క నిధుల విషయంలోనే కాదు, పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్, ఎగువ, దిగువ కాఫర్డ్యామ్ల నిర్మాణంలో డిజైన్ల మార్పులను కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదిస్తే తప్ప పోలవరం సాగు నీటి ప్రాజెక్టు నిర్వహణలోనికి రాదని కూడా కేంద్రం గతంలోనే తేల్చి చెప్పింది. మరి, తమ గుట్టురట్టవడంతో వైసీపీ నేతల రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.