“హలో కొడాలి.. ఇటు చూడాలి!“ ఇదీ.. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. ఎందు కంటే.. ఆయన గత 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గాన్ని ఏలుతున్నారు. ఇక్కడి ప్రజలు కూడా ఆయనను ఎలాంటి విసుగు, విరామం లేకుండా గెలిపిస్తూనే ఉన్నారు. మరి 20 ఏళ్లపాటు ఆయన గుడివాడకు మకుటం లేని మహారాజు మాదిరిగా ఏలుతున్న నేపథ్యంలో ఇక్కడి పరిస్థితి ఎలా ఉండాలి? అసలు మురికి వాడలు.. అనే మాట వినిపించకూడదు కదా! పోనీ.. ఈ 20 ఏళ్లలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారనే అనుకుందాం.
మిగిలిన పదేళ్లపాటు ఆయన అధికారపక్షంలోనే ఉన్నారు. పైగా.. రెండున్నరేళ్లు మంత్రిగా కూడా ఉన్నా రు. ఇంత అద్భుత అవకాశం దొరికినప్పుడు.. ఆయన గుడివాడను అద్దంగా తీర్చిదిద్దాలి కదా! ఎందుకం టే ఇటీవల ఆయన ఒక మాట చెప్పారు. తనమనసు, ఆత్మ అంతా కూడా గుడివాడేనని! సో.. అలాంటి మనసుపై ఆయన దృష్టి పెట్టారా? మురికివాడలు లేని గుడివాడను తీర్చిదిద్దారా? ఇరికిరుకు.. సందులు .. పందులు తిరిగే ప్రాంతాలు లేకుండా చేశారా?
ప్రజలు ముక్కు మూసుకోకుండా.. నియోజకవర్గంలో ఏ సందులోకైనా వెళ్లే పరిస్థితిని కల్పించారా? అంటే.. లేదనే వాదనే వినిపిస్తోంది. పైకి ఆయన ఎన్ని ఘీంకరింపులు చేసినా.. ఎంతగా తాను అభివృద్ధి చేశానని చెప్పుకొన్నా.. సుదీర్ఘకాలంగా కొడాలి వారి కరుణకు నోచుకోని.. ప్రాంతాలు పదుల సంఖ్యలో ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ, ఇది వాస్తవం. 20 ఏళ్లుగా నియోజకవర్గాన్ని ఏలుతున్నా.. గుడివాడ బస్టాండ్ పక్క రోడ్డును కూడా ఆయన బాగు చేసుకోలేక పోయారు.
ఇక్కడ రెండు వేల గడప ఉంది. కానీ, ముక్కుమూసుకోకుండా.. ఈ ప్రాంతంలో పర్యటించడం.. మనసు న్న కొడాలికే సాధ్యం కాదు. అలా ఉంటుంది ఈ ప్రాంతం. ఇక, మురికివాడల సంగతి చెప్పనక్కర్లేదు. గుడివాడలోని పట్టణ పరిధిలోనే 5 మురికి వాడలు ఉన్నాయి. అంటే.. ఇక్కడి ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా లేదు. ఇంటి నుంచి వచ్చేమురుగు నీరు కూడా బయటకు పోయే సౌకర్యం లేక.. నిత్యం ఎదురింటి వాళ్లు పొరిగింటి వాళ్లు జుట్టు జట్టు పట్టుకునే పరిస్థితి.
మరికొన్ని ప్రాంతాల్లో తాగునీరు సమస్య చెప్పనక్కర్లేదు. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా కొడాలి పరువు నీళ్లలో కలిసి పోతోంది. కట్ చేస్తే.. గుడివాడపై మనసున్న మారాజు కొడాలి నానికి.. ఈ వాడలంటే పడదు. ఇక్కడి జనాలంటే ఏవగింపు. కనీసం.. ఎన్నికల సమయంలో అయినా.. ఇక్కడ పర్యటిస్తారా? అంటే లేదు. తన అనుచరులను పంపించి.. `అన్న చెప్పాడు ఓటు మనకే` అని ఆదేశాలు జారీ చేస్తారు. కానీ.. ఇప్పుడు ఇలాంటి పప్పులు ఉడకవు. టీడీపీ నేత వెనిగండ్ల ఇలాంటి ప్రాంతాల్లోనే తిరుగుతున్నారు. సమస్యలు వింటున్నారు. హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా.. కొడాలి.. ఇలాంటి వాటిని పట్టించుకుంటారో లేదో చూడాలి.