కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును కూలగొట్టి.. తాము అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బిహార్‌లో రాత్రికి రాత్రి మారిన రాజకీయాలు చావు దెబ్బగా పరిణమించాయని అంటున్నారుపరిశీలకులు. అదేంటి? అనుకుంటున్నారా? నిజానికి బిహార్‌లో కాంగ్రెస్ బలంగా లేదు. అయినప్పటికీ.. ఇక్కడి అధికార పార్టీ జేడీయూ నేత, సీఎం.. నితీష్‌కుమార్‌పై పార్టీ ఆశలు పెట్టుకుంది. మొత్తం 40 పార్లమెంటు స్థానాలున్న బిహార్‌లో తమకు 10 ఇచ్చినా.. 30 మిగిలిన వారు పంచుకున్నా.. గెలిచిన తర్వాత.. అందరూ కలిసి కేంద్రంలో అధికారం ఏర్పాటు చేయాలని అనుకున్నారు.
కానీ, నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో ఉన్న నితీష్ కుమార్.. దాదాపు ఈ కూటమికి రాం రాం చెప్పేశారు. అంతేకాదు.. గత రెండేళ్ల కిందట కోరి కోరి వదులుకు బీజేపీతో మళ్లీ చెలిమి చేసేందుకు రెడీ అయ్యారు. ఢిల్లీ పెద్దలతో ఆయన మంతనాలు కూడా సాగిస్తున్నారు. బిహార్‌లో ప్రస్తుతం ఆర్జేడీ, కాంగ్రెస్, నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూలు కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ పార్టీలను వదిలేసి.. మరోసారి బీజేపీతో జట్టు కట్టేందుకు నితీష్‌కుమార్ రెడీ అయ్యారు. దీనికి ప్రధానంగా తనకు ప్రధాన మంత్రి పీఠం ఇచ్చే ఉద్దేశం ఇండియా కూటమి లేకపోవడమేనని నితీష్ భావిస్తున్నారు.
దీనికితోడు అయోధ్యలో బీజేపీ రామమందిరం నిర్మించడం.. బాలరాముడికి.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ట చేసిన దరిమిలా.. దేశవ్యాప్తంగా బీజేపీ హోరు.. జోరు పెరిగిందనే సంకేతాలు వస్తున్నాయి. అంతేకాదు.. బీజేపీ దాదాపు 400 సీట్లలో విజయం దక్కించుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికి తగినట్టే ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశవ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే.. ఇండియా కూటమిలో ఐక్యత సన్నగిల్లడం.. కాంగ్రెస్ అంతర్గత పెత్తనం చేస్తున్నదనే భావన పెరిగిపోవడంతో నితీష్.. తన దారి తాను చూసుకునేందుకురెడీ అయ్యారు.
ఈ క్రమంలోనే ఆయన ఈ రోజో రేపో.. తన సర్కారును తానే కూలదోసి.. మళ్లీ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు.. బీజేపీ కూడా.. కేంద్రస్థాయిలో నితీష్‌తో కలిసి పనిచేసేందుకు బిహార్‌లో అధికారంలోక ఇవచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో సుదీర్గ మంతనాలు కూడా జరిగాయి. నితీష్ ఓకే అంటే.. వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామం నితీష్‌కు సీఎం సీటును పదిలం చేస్తుండగా.. కాంగ్రెస్‌కు మాత్రం కేంద్రంపై పెట్టుకున్న ఆశలు నిర్వీర్యమవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.