ఈ టెక్ జమానాలో భారతీయులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకొని జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటున్నారు. దేశంలోని మారు మూల పల్లెటూళ్లలో కూడా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు వాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే, టెక్నాలజీని అందిపుచ్చుకున్నంత వేగంగా…అనాదిగా వస్తున్న మూఢాచారాలను కొందరు ప్రజలు వదులుకోలేకపోతున్నారు. ఈ కాలంలోనూ మూఢ నమ్మకాలు, దురాచారాలను నమ్మి ఓ యువతి శీలానికి వెల కట్టిన వైనం వింటే ఛీ అనిపించకమానదు.
రాజస్థాన్ లో జరిగిన ఈ హేయమైన ఘటన ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెళ్లయిన తొలిరోజే ఆ యువతికి అత్తమామలు కన్యత్వ పరీక్ష నిర్వహించిన వైనం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. ఇక, కన్యత్వ పరీక్షలో ఆమె విఫలమైందని ఆ వ్యవహారంపై కుల పంచాయితీ పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, ఆమె కన్యత్వ పరీక్షలో విఫలమైనందు వల్ల రూ.10 లక్షలు చెల్లించాలని కూడా ఆ అత్తమామలు డిమాండ్ చేశారు.
దీంతో, ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా…వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాను కన్యత్వ పరీక్షలో విఫలం అయ్యానంటూ భర్త, అత్తమామలు తనపై దాడి చేశారని కూడా ఆమె ఫిర్యాదు చేసింది. తన కన్యత్వ పరీక్షపై స్థానిక ఆలయంలో కుల పంచాయితీ పెట్టారని, తాను శీలవతిని కాదని ముద్ర వేసిన పంచాయతీ పెద్దలు రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారని కూడా పోలీసులకు వెల్లడించింది.
అయితే, వివాహానికి ముందే పక్కింటి వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురయ్యానని మెట్టినింటి వారికి ఆ యువతి తెలిపిందని, అయినా సరే వారు తాను శీలవతిని కాదంటూ తనపై దాడి చేసినట్టు ఫిర్యాదు చేసింది.