టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న రా..కదలిరా! సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. భారీ ఎత్తున కదలి వస్తున్నారు. సభా ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో టీడీపీలో కొత్త జోష్ ప్రారంభమైంది. తాజాగా నెల్లూరు, పత్తి కొండ నియోజకవర్గాల్లో నిర్వహించిన రా..కదలిరా! సభలు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా జనం రావడం .. సాక్షాత్తూ చంద్రబాబును సైతం మంత్రముగ్ధులను చేసింది. `ఈ జనాన్ని చూస్తే.. జగన్ ఓటమి ఇప్పుడే రాసిపెట్టినట్టుంది` అని చంద్రబాబు ఆవేశంగా చెప్పారంటే.. ఆయనలో ఆనందం అంతా ఇంతా కాదు.
ఈ నెల తొలి నాళ్లలో యువగళం-నవశకం పేరుతో ఎన్నికల శంఖం పూరించినప్పటికీ.. తర్వాత.. రా.. కదలిరా! పేరుతో సభలకు శ్రీకారం చుట్టారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 22 చోట్ల ఈ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం కూడా ఈ సభలకు ప్లాన్ చేశారు. ఇప్పటికే కొన్నినియోజకవర్గాల్లో సభలను పూర్తి చేశారు. గత సభల కంటే కూడా.. తాజాగా కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించిన సభలకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా జనాలు రావడంతో పార్టీ వర్గాల్లో సంతోషం వ్యక్తమైంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు ప్రజలకు దిశానిర్దేశం చేయడంతోపాటు వైసీపీ అధినేత, సీఎం జగన్పై నిప్పులు చెరిగారు.
ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీకూటమిని ఆశీర్వదించాలంటూ.. చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే.. 4 లక్షల మందికి ఏటా ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్పుడు కూడా యువత నుంచి మంచి స్పందన కనిపించింది. జగన్ ప్రభుత్వం 73 రోజుల్లో కూలిపోతుందని.. టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం రానుందని ఆయన చెప్పినప్పుడు .. ఈలలు, చప్పట్లతో సభ మార్మోగింది. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని అన్నప్పుడు.. ఆ వర్గం నుంచి మంచి రెస్పాన్స్ కనిపించింది. మొత్తంగా నెల్లూరు, పత్తి కొండ సభలు ఇప్పటి వరకు జరిగిన సభలకు భిన్నంగా జరగడం గమనార్హం.
ఆయా సభల్లో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పత్తికొండ, నెల్లూరు సిటీ, కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని,ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలపై చంద్రబాబు విమర్శలు చేశారు. మాఫియా ముఠాకు ఓ ఎమ్మెల్యే నాయకురాలుగా ఉన్నారని అన్నప్పుడు.. జనాల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఓ నేత ఇలాకాలో రెడ్డి వర్గం అజమాయిసీ చేస్తోందని చెప్పినప్పుడు ఔను.. ఔను.. అంటూ.. స్పందన కనిపించింది. ఇలా.. జనాల నుంచి స్పందన రావడంతో చంద్రబాబు ఈ రెండు సభల్లోనూ రెచ్చిపోయి మాట్లాడారు. జనసేన-టీడీపీ విజయం ఖాయమన్న ఆనందం ఆయనలో వ్యక్తమైంది. ఇదే విషయాన్ని ఆయన తర్వాత.. పార్టీ నాయకులకు కూడా తేల్చి చెప్పడం గమనార్హం.