‘సామాజిక సాధికార యాత్ర’ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కవర్ చేసేలాగా బస్సు యాత్రను వైసిపి నేతలు రూపొందించారు. అయితే, ఈ యాత్ర మొదలై రెండు రోజులు అవుతున్నప్పటికీ ప్రజల నుంచి యాత్రకు తగినంత స్పందన రావడంలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యాత్రపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో అన్ని పదవులు రెడ్లకే కట్టబెట్టి ఏ ముఖం పెట్టుకొని సామాజిక సాధికార సభ నిర్వహిస్తారని రఘురామ విమర్శించారు. టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇలా రెడ్లంతా తిరుపతిలో రాజ్యమేలుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అజయ్ రెడ్డి, ఇంకొ కార్పొరేషన్ చైర్మన్ గా రాజశేఖర్ రెడ్డి లను నియమించబోతున్నట్టుగా తెలుస్తోందని, ఇటువంటి సందర్భంలో సామాజిక సాధికారత ఎక్కడ సాధ్యమని ఎద్దేవా చేశారు.
సొంత సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టడంలో జగన్ ముందుంటున్నారని, అందుకే ఈ యాత్రకు ప్రజల మద్దతు లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితిని తెనాలి సామాజిక సాధికారిక సభ నిరూపించిందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి ఘనవిజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కూటమిలో బిజెపి చేరితే వైసిపి అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెనాలిలో జరిగిన సామాజిక సాధికార సభలో కుర్చీలు ఖాళీగా ఉండటంతో జనం లేక ఆ సభ వెలవెలబోయిన నేపథ్యంలో రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు.