“నిను వీడని నీడను నేనే…కథగా మెదిలే కల నేనే….నిను వీడని నీడను నేనే….” ఏపీ సీఎం జగన్ ను గత కొద్ది నెలలుగా వీడని నీడలా వెంటాడుతున్న పెడుతున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు ఈ పాట అతికినట్లు సరిపోతుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పట్టువదలని విక్రమార్కుడిలా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై ఆర్ఆర్ఆర్ మరో సారి న్యాయపోరాటానికి దిగారు.
జగన్ అక్రమాస్తులపై పూర్తి స్థాయి దర్యాపునకు ఆదేశించాలని తెలంగాణ హైకోర్టులో గత ఏడాది రఘురామ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఆ అక్రమాస్తులపై సీబీఐ అసమగ్రంగా దర్యాప్తు చేసిందని పేర్కొన్నారు. అంతేకాదు, విదేశాలనుంచి, బోగస్ కంపెనీలనుంచి జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై సీబీఐ దర్యాప్తు చేయకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలకు లేఖ రాసి చేతులు దులిపేసుకుందని తన పిటిషన్ లో షాకింగ్ ఆరోపణలు చేశారు.
అంతేకాదు, ఆ వ్యవహారంలో డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేయలేదని రఘురామ ఆరోపించారు. అయితే, ఈ పిల్ పై హైకోర్టు రిజిస్ర్టీ పలు అభ్యంతరాలు తెలపడంతో పిటిషన్‌కు రెగ్యులర్ నంబరు ఇవ్వలేదు. దీంతో, ఈ పిటిషన్ విచారణార్హతపై నిర్ణయం తీసుకునే వ్యవహారం నేడు విచారణకు వచ్చింది. సీఎం జగన్‌ను ఎందుకు ప్రతివాదులుగా చేర్చలేదని ధర్మాసనం ప్రశ్నించింది. జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినకుండా ఆదేశాలు జారీ చేయలేం కదా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
అయితే, పిటిషనర్ రఘురామ ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరం లేదని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందని గుర్తు చేశారు. దీంతో, రఘురామ వేసిన పిల్ విచారణార్హతపై నిర్ణయం తీసుకుంటామని, తీర్పును రిజర్వు చేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది. ఆ పిటిషన్ విచారణకు స్వీకరిస్తే…జగన్ కు చిక్కులు తప్పేలా లేవు. దీంతో, జగన్ ను రఘురామ నీడలా వెంటాడుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.