వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఎం జగన్ ను మరో కోణంలో గట్టిగానే ఇరికించేశారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును అడ్డు పెట్టుకుని.. కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారంటూ.. ఆయన కేంద్ర ప్రభుత్వానికి జగన్ సర్కారుపై ఫిర్యాదులు చేశారు. బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన ఎంపీ రఘురామ.. పోలవరం విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని.. వీటిని పరిశీలించాలని ఆయనకు ఫిర్యాదు చేశారు.
ఇదీ కంప్లైంట్
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రం పరిధిలో ఉన్న పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయ ని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో షెకావత్‌కు ఎంపీ రఘురామ రెండు లేఖలు అందించి, పలు వివరాలు తెలిపారు. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్మును కాజేస్తున్నారని తెలిపారు. లబ్ధిదారులను పక్కనపెడుతూ నకిలీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. నకిలీ లబ్దిదారుల పేర్లతో ఖాతాలు తెరిచి పునరావాస నిధులు కాజేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
రివర్స్ పేరుతోనూ..
అలాగే, రివర్సర్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయిస్తున్నారని రఘు రా మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదనపు కేటాయింపుల్లో 25 శాతం వరకు కమీషన్లు కోరుతున్నారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఏపీ సీఐడీ పోలీసులు తనపై వ్యవహరించిన తీరును కూడా గజేంద్ర సింగ్ షెకావత్‌కు రఘురామ వివరించినట్టు తెలిసింది. దీంతో సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై కేంద్రం ఎలాంటి వైఖరి తీసుకుంటుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.