జమిలి ఎన్నికలపై లా కమీషన్ క్లారిటీ ఇచ్చినట్లేనా ? అవును ఏం క్లారిటి ఇచ్చిందంటే 2024లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని. జమిలి ఎన్నికలపై నరేంద్ర మోడీ మహా మోజుతో ఉన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణపై మోడీ, అమిత్ షా చాలా మాటలే చెబుతున్నారు. ఖర్చులు కలిసొస్తాయని, ఒకేసారి దేశంలో ఎన్నికలు అయిపోతే తర్వాత ఐదేళ్ళు అభివృద్ధిపైనే దృష్టిని పెట్టవచ్చనే మాటలు చాలానే చెబుతున్నారు. అయితే ఇవేవీ అసలు కారణాలు కావని అందరికీ తెలిసిందే.
అసలు విషయం ఏమిటంటే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేస్తున్న జనాలు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీని పక్కన పెట్టేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకే పెద్దపీట వేస్తున్నారు. దాంతో దేశమంతా తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్నా మోడీ కలలు సాకారం కావటంలేదు. అందుకనే అవకాశం ఉన్న ప్రతి రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వాలను కూలదోసి ఏదో రకంగా అధికారంలోకి వచ్చామని అనిపించుకుంటున్నది. కర్నాటక, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చేసింది.
రాజస్థాన్ లో ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూలదోయటం సాధ్యం కాక లెఫ్ట్ నెంట్ జనరల్ (ఎల్జీ)ని ముందు పెట్టి వెనక నుండి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రాచిరంపాన పెడుతున్నారు. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందుకనే రాష్ట్రాల్లో కూడా బీజేపీకి జనాలు ఓట్లేయాలంటే జమిలి ఎన్నికలు ఒకటే మార్గమని మోడీ అనుకున్నారు. జమిలి ఎన్నికలు జరిగితే పార్లమెంట్, అసెంబ్లీల్లో రెండు ఓట్లు జనాలు బీజేపీకే వేస్తారని మోడీ నమ్ముతున్నారు.
అందుకనే జమిలి జపం పెంచేస్తున్నారు. అయితే సడెన్ గా జమిలి ఎన్నికలంటే సాధ్యంకాదు. ఎందుకంటే 30 రాష్ట్రాల్లో సుమారు 16 రాష్ట్రాలు జమిలి ఎన్నికలకు ఓకే చెప్పాలి. లేకపోతే సాధ్యంకాదు. ఈ విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే లా కమీషన్ జమిలి ఎన్నికలు 2024లో సాధ్యంకాదని తేల్చేసింది. 2024 ఎన్నికల్లోగా తమ అధ్యయనం పూర్తిచేసి రిపోర్టు అందిస్తామని చెప్పింది. 2029 ఎన్నికలకు జమిలి ఎన్నికల నిర్వహణకు అవకాశాలు ఉన్నాయని కమీషన్ చెప్పింది. మరి అప్పటివరకు మోడీ వెయిట్ చేయక తప్పదేమో.