త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మార్చబోతున్నారంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ కాక రేపాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.
బిజెపి నేతలు అహంకారంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, సీఎం మార్పు అంటూ ప్రకటనలు చేస్తూ వారి అవివేకాన్ని బయట పెట్టుకుంటున్నారని పొన్నం విమర్శించారు. ముఖ్యమంత్రిని మార్చాలని అధిష్టానం నిర్ణయించుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ విషయం గురించి ఎప్పుడో ప్రకటన చేసి ఉండేవారని పొన్నం చెప్పారు.
ఇక, కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను పొన్నం ఖండించారు. బీఆర్ఎస్, బిజెపి విమర్శలను తిప్పి కొట్టారు. కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని పొన్నం కొట్టిపారేశారు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని పొన్నం కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోకి మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓ బిజెపి ఎంపీ వెనకనుంచి నడిపిస్తున్నారని కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. ఆ ఎంపీ పేరు చెప్పే దమ్ము, ధైర్యం కేటీఆర్ కు ఉన్నాయా అని పొన్నం ప్రశ్నించారు.