నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు బెయిల్ పిటిషన్, వైద్య పరీక్షల వ్యవహారం ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ ఎంపీగానే కాకుండా, భారత దేశ పౌరుడిగా రాజ్యాంగం రఘురామకు ఇచ్చిన హక్కులను సీఐడీ అధికారులతోపాటు, ఏపీ ప్రభుత్వం కూడా కాలరాస్తోందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. హైకోర్టు చెప్పినా కూడా రఘురామను రమేశ్ ఆసుపత్రికి సీఐడీ అధికారులు తరలించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రఘురామ సుప్రీం కోర్టు తలుపు తట్టారు.
ఈ క్రమంలోనే రఘురామ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. అంతేకాదు, రఘురామకు నిర్వహించే వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించింది. దీంతోపాటు, రఘురామ వైద్య నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని ఆదేశించింది.
దీంతోపాటే, తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రఘురామకు వైద్య పరీక్షలు జరిగే సమయాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని దేశపు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
రఘురామకు వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను మే 21కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో రఘురామకృష్ణరాజును నేడు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సుప్రీం కోర్టు తాజా నిర్ణయంతో జగన్ కు, సీఐడీ అధికారులకు షాక్ తగిలినట్లయింది.