మారుతున్న ప్రేక్షకుల అభిరుచి ప్రకారం రొటీన్ మాస్ మసాలా సినిమాలకు ఇక కాలం చెల్లినట్లే అనుకున్నారు అంతా. కానీ విచిత్రంగా ఈ మధ్య ఆ సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. కరోనా తర్వాత ఈ చిత్రమైన మార్పు అన్ని సినీ పరిశ్రమల్లోనూ గమనించవచ్చు.
క్లాస్ ప్రేక్షకులు ఓటీటీలకు కనెక్ట్ అయిపోయి అందులోని టాప్ క్వాలిటీ వెబ్ సిరీస్‌లతో కాలక్షేపం చేస్తూ థియేటర్లకు రావడం తగ్గించేయగా.. మాస్ ప్రేక్షకులు మాత్రం తమ అభిరుచికి తగ్గ సినిమాలు చూడ్డానికి థియేటర్లకు తరలి వస్తున్నారు. ఇప్పుడు మాస్‌ను మెప్పించే సినిమాలే వరుసగా బాక్సాఫీస్‌ను కళకళలాడిస్తుండడం ఆసక్తికర పరిణామం.
గత ఏడాది చివర్లో వచ్చిన ‘ధమాకా’ సినిమాను చూసి అదే రొటీన్ మోత అంటూ విమర్శకులు పెదవి విరిచారు. సినిమా నిలబడ్డం కష్టమే అన్నారు. కానీ అనూహ్యంగా ఆ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఇప్పుడు సంక్రాంతికి కూడా ఇదే సీన్ రిపీటైంది. వాల్తేరు వీరయ్యను రొటీన్ సినిమా అన్నారు. ‘వీరసింహారెడ్డి’ని మరీ రొడ్డకొట్టుడు సినిమాగా విమర్శించారు. కానీ క్రిటిక్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమాలు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి.
బాలయ్య సినిమా అయినా తొలి రోజు తర్వాత జోరు తగ్గించింది కానీ.. చిరు చిత్రం మాత్రం నిలకడగా కలెక్షన్లు తెచ్చుకుంటూ బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్తోంది. టాలీవుడ్లోనే కాదు.. వేరే పరిశ్రమల్లోనూ ఇదే ట్రెండును గమనించవచ్చు. సంక్రాంతి సినిమాలు వారిసు, తునివు ఒక ఫార్మాట్లో సాగిపోయే సినిమాలే. కానీ వాటికి గొప్ప ఆదరణ దక్కుతోంది. హిందీలో సైతం మాస్ టచ్ ఉన్న బిగ్ టికెట్ సినిమాలే ఆడుతున్నాయి తప్ప.. క్లాస్ సినిమాలకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. కాబట్టి నడుస్తున్న ట్రెండును బట్టి ఫిలిం మేకర్స్ అందరూ కొంత కాలం పాటు స్టార్ హీరోల అభిమానులతో పాటు మాస్‌ను మెప్పించే సినిమాలకే పెద్ద పెీట వేయక తప్పేలా లేదు.