దేశ ఆర్థిక రాజధానిగా అభివర్ణించే ముంబయి మహానగరం ఉన్న రాష్ట్ర మహారాష్ట్ర. తాజాగా ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిపికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో పాగా వేయటం ద్వారా తమ సత్తా చాటాలని కాంగ్రెస్.. బీజేపీలు భావిస్తున్నాయి. వీరికి అండగా ఉండే మరికొన్ని పార్టీలు సైతం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి వేళ.. మహా ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపే అంశాల్లో ఒకటి మరాఠా కోటా ఇష్యూ. ఈ కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే. ఆయనపై ప్రధాన రాజకీయ పార్టీల చూపు ఉంది. ఆయన మద్దతు కోసం అందరూ తపిస్తున్నారు.
దీంతో.. ఇప్పుడు ఆయన ఎవరివైపు మొగ్గుతారు? అన్నది ప్రశ్నగా మారింది. నిజానికి గత ఏడాది వరకు కూడా మనోజ్ జరాంగే ఎవరన్న దానిపై ఎవరికి తెలియదు. అయితే.. గత ఏడాది సెప్టెంబరులో మరాఠా కోటా కోసం ఆందోళన ప్రారంభించటం.. దానికి పెద్ద ఎత్తున స్పందన రావటంతో ఆయన అనతికాలంలో ఫేమస్ అయ్యారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది.
ఓబీసీ కోటాలో మరాఠాలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. దీన్నో ఉద్యమంగా ఆయన నడిపారు. అది కాస్తా తీవ్ర రూపం దాల్చటమే కాదు.. రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై తమ స్టాండ్ పై స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరార్వాడా ప్రాంతంలోని జల్నా జిల్లా అంతర్ వాలీ సరాతీలో ఆయన ఆరుసార్లు నిరాహార దీక్ష చేశారు. దీంతో.. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ఆయన పాపులర్ అయ్యారు.
ఆయన ప్రభావం రాజకీయంగా ఎంతన్న దానికి ఒక ఉదాహరణను రాజకీయ వర్గాలు చెబుతున్నారు మొన్నీమధ్యన ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత్రత్వంలోని మహాయుతి కూటమి దెబ్బ తినటానికి కూడా ఇతడే కారణమంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరాఠా కోటాను సమర్థించిన వారికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో జరాంగేను కలిసేందుకు పలు పార్టీల నేతలు ఆసక్తిని చూపుతున్నారు.
జరాంగేను కలిసిన వారిలో ప్రస్తుత ప్రభుత్వంలోని పలువురు మంత్రులతో పాటు.. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రథ్వీ రాజ్ చవాన్.. ఎమ్మెల్యే ధీరజ్ దేశ్ ముఖ్ కుడా ఉన్నారు. అందరి చూపు జరాంగే మీద ఉన్న వేళ.. ఆయన ఎవరికి తన మద్దతు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.