తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ లో చేరేందుకు రమణకు ఆహ్వానం అందడంతో ఎల్.రమణ గులాబీ దళంలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండ్రోజుల క్రితం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న రమణ …తాజాగా నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. రమణకు గులాబీ కండువా కప్పిన గులాబీ బాస్…ఆయనను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
తాజాగా కారెక్కిన రమణను కేసీఆర్ ఆకాశానికెత్తేశారు. సిద్ధాంతం కోసం నిబద్ధతతో పనిచేసే నాయకుడు ఎల్.రమణ అని సారు కితాబిచ్చారు. రమణతో సహా పార్టీలో చేరిన నేతలకు మంచి పదవులు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. చేనేత వర్గంలో నాయకత్వలోటుందని, ఆ బాధ్యత ఎల్.రమణకు అప్పగిస్తామని అన్నారు. రైతు బీమా తరహాలోనే చేనేతలకూ బీమా త్వరలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరే రాష్ట్రంలోనూ లేవని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని పక్కా ఎజెండాతో ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ పునఃనిర్మాణానికి విశేష కృషి చేసిన మహనీయులు ప్రొ.జయశంకర్, ఆర్.విద్యాసాగర్ రావు సేవలను ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.