ఆస్కార్ అవార్డుల నామినేషన్ రేసులో భారత్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ నామినేట్ కాకపోవడంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలను తోసిరాజని గుజరాతీ చిన్న చిత్రం ‘ఛెల్లో షో’ ఆ చాన్స్ ను కొట్టేయడంపై రాజకీయ దుమారం రేగుతోంది. గుజరాతీ సినిమా కాబట్టి దాన్ని నామినేట్ చేశారని, దీని వెనుక ప్రధాని మోదీ, కేంద్రం పెద్దల హస్తం ఉందని అంటున్నారు.
ఆల్రెడీ ఆ గుజరాతీ సినిమా ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ఓ ఇటాలియన్ సినిమాకు కాపీ అని, అటువంటి సినిమాను ఆస్కార్ కు పంపితే కచ్చితంగా తిరస్కరిస్తారని అంటున్నారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో దీని పై మంత్రి కేటీఆర్ స్పందించారు.
ఇటువంటి విషయాలపై తెలంగాణ బీజేపీ జోకర్ ఒక్కరు కూడా ప్రశ్నించలేరని, డిమాండ్ చేసే దమ్ము లేదని, గుజరాతీ బాస్ల చెప్పులు మోయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని బండి సంజయ్ నుద్దేశించి కేటీఆర్ సెటైర్లు వేశారు. మోడీవర్స్కు గుజరాత్ కేంద్రం అంటూ కేటీఆర్ చురకలంటించారు. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రాణించినప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎందుకు రాణించలేరు అని ఓ జాతీయ మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు.
ఆస్కార్ వ్యవహారంపై టాలీవుడ్ దర్శకుడు ఎన్.శంకర్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్ర అవార్డుకు, జాతీయ అవార్డుకు, ఆస్కార్ అవార్డుకు తేడా తెలియని కమిటీలు ఉంటే సెలక్షన్ ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. సెలెక్షన్ కమిటీపై అనేక ఒత్తిళ్లు ఉంటాయని, కానీ ఆ కమిటీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచక్షణతో పనిచేయాలని హితవు పలికారు. ‘ఛెల్లో షో’ వంటి చిత్రాలు దక్షిణాదిన ఎన్నో వచ్చాయని, ఆ చిత్రంలో ఏం చూసి ఆస్కార్ కు నామినేట్ చేశారని ఎన్.శంకర్ ప్రశ్నించారు.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో దేశభక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలు ఉన్నాయని, భారత సినిమా రంగ ప్రతిష్ఠను కాపాడేందుకు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఎంతో శ్రమించిందని, కానీ ఆ సినిమాకు ఆస్కార్ కు వెళ్లే అవకాశం దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. మరోవైపు, ‘ఆస్కార్ రేస్ లో గుజరాత్ ఛెలో షో తో పోటీ పడి మన ఆర్ఆర్ఆర్ ఓడిపోయింది. మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా రాలే. కానీ గుజరాత్ కు లోకోమోటివ్ ఫ్యాక్టరీ వచ్చింది. మా హైదరాబాద్ కు వచ్చిన WHO సెంటర్ గుజరాత్ కు తరలిపోయింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఆర్బిట్రేషన్ సెంటర్ కు పోటీగా గుజరాత్ సిటీలో ఏర్పాటు చేసిన GIFT పోటీదారుడిగా మారింది’ అంటూ ఉస్మానియా వర్శిటీ ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ట్వీట్ చేశారు.