తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణది ప్రత్యేక అధ్యాయం. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి శిఖరాలను ఢీకొట్టి టాలీవుడ్లో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించడం, ఒక దశలో వాళ్లిద్దరూ కూడా కంగారు పడే స్థాయిలో అప్రతిహత విజయాలతో దూసుకెళ్లడం అంటే చిన్న విషయం కాదు.
‘సాహసమే నా ఊపిరి’ అనే తన సినిమా టైటిల్‌కు తగ్గట్లే కెరీర్లో ఎన్నో సాహసోపేత చిత్రాలతో సంచలనం రేపిన ఈ లెజెండరీ నటుడు.. శరవేగంగా 300 సినిమాలు పూర్తి చేసేశాడు. ఇప్పుడు స్టార్ హీరోలంటే రెండేళ్లకు ఒక సినిమా చేయడం గగనంగా ఉంది. అలాంటిది తన కెరీర్ పీక్ టైంలో సంవత్సరానికి డజను రిలీజ్లు చేసిన ఘనత కృష్ణకే చెల్లుతుంది.
90వ దశకం చివరి వరకు ఆయన హీరోగా విరామం లేకుండా సినిమాలు చేశారు. 2000 తర్వాత యువతరం నటుల హవా పెరిగి, తన సినిమాలకు ఆదరణ బాగా తగ్గిపోవడంతో కృష్ణ జోరు కూడా తగ్గింది. హీరో రోల్స్ పక్కన పెట్టేసి అప్పుడప్పుడూ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ముందుకు సాగారు కృష్ణ.
చురుగ్గా ఉన్న సమయంలో రవితేజ ‘బలాదూర్’, విక్రమ్ ‘మల్లన్న’ లాంటి చిత్రాల్లో నటించిన కృష్ణ.. ఆ తర్వాత సినిమాలకు దాదాపుగా దూరం అయినట్లే కనిపించారు. 2013లో వచ్చిన ఆది సాయికుమార్ సినిమా ‘సుకుమారుడు’లో అతిథి పాత్ర చేశాక కృష్ణ తర్వాత సినిమాల పట్ల ఆసక్తి లేనట్లే ఉన్నారు.
ఐతే మళ్లీ ఓపిక చేసుకుని 2016లో ‘శ్రీ శ్రీ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేశారు. ఆ చిత్రంలో విజయ నిర్మల కూడా నటించడం, ఆయన భార్య పాత్రనే పోషించడం విశేషం. సీనియర్ దర్శకుడు ముప్పలనేని శివ ఈ చిత్రాన్ని రూపొందించారు. తన కూతురి హత్యకు ప్రతీకారం తీర్చుకునే నడి వయస్కుడి పాత్రలో ఆయన నటించారు.
‘శ్రీ శ్రీ’ తర్వాత ఆయన మరే సినిమాలోనూ నటించలేదు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందకపోయినా.. కృష్ణను మళ్లీ లీడ్ రోల్లో చూడడం వీరాభిమానులకు మాత్రం ఒక మంచి జ్ఞాపకమే. టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన కృష్ణ.. మధ్యలో క్యారెక్టర్ రోల్స్ చేసినా చివరగా హీరోగానే ఆయన తన కెరీర్‌ను ముగించడం విశేషం.