తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్.. సినిమా.. తాజాగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని `నాటు నాటు..` పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను పులకింపజేసింది. నాటు బీటుకు.. అవార్డు న్యాయనిర్ణేతలు సైతం పులకించి పోయారు. సాంగ్ ప్రదర్శన సమయంలో కుర్చీల నుంచి లేచి నిలబడి.. చప్పట్లతో మార్మోగించారు. దుమ్మురేపిన నాటు నాటు పాటకు సంగీత ప్రపంచంలో ఐకాన్‌గా నిలిచిన.. ఎం.ఎం. కీరవాణి బాణీలను సమకూర్చగా.. దిగ్గజ రచయిత చంద్రబోస్.. లిరిక్స్ అందించారు.
ఈ అవార్డులను ఇరువురూ.. అందుకో వడం విశేషం. బాణీలను సమకూర్చిన కీరవాణి, లిరిక్స్ రచయిత.. చంద్రబోస్‌లకు ఆస్కార్ లభించింది. ఈ సందర్భంగా కీరవాణి.. ఉబ్బితబ్బిబ్బయ్యారు. తనకు ఏం మాట్లాడాలో.. అర్ధం కాని పరిస్థితి.. అంటూ.. ఒక చేత అవార్డును పుచ్చుకుని మరో చేత్తో తలనిమురుకున్నారు.
"Naatu Naatu" from #RRR wins Best Original Song at the #Oscars. https://t.co/ndiKiHfmID pic.twitter.com/d7ZSoRps2d
— Variety (@Variety) March 13, 2023
అంటే.. అవార్డు అందుకున్న ఆనందం.. ఆయన హృదయాన్ని కప్పేసింది. కొన్ని సెకన్లలోనే తేరుకుని.. నాటు నాటు పాట ద్వారా లభించిన ఈ అవార్డు.. తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలిపిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆస్కార్ అకాడమీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ, తెలుగు చలన చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిందని పేర్కొన్నారు. ఆర్ ఆర్ ఆర్ దేశాన్ని గర్వపడేలా చేసిందన్నారు.
గీత రచయిత చంద్రబోస్.. `నమస్తే` అంటూ.. అచ్చతెలుగులో అకాడమీకి అభినందనలు తెలిపారు. ఇక, ఆర్ ఆర్ ఆర్ పాటకు.. ఆస్కారం లభించడం పట్ల దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.