బెల్లం ఉన్న చోటకే చీమలు వస్తాయన్న సామెతను రాజకీయ నేతలు రుజువు చేస్తున్నారు. ముఖ్యంగా.. అధికార పార్టీ ప్రాభవం పోతే.. నాయకులు కూడా ప్లేట్ ఫిరాయించేస్తున్నారు. నాయకులు ఎంతటి వారైనా .. సరే.. అధికారమే పరమావధిగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామమే ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్కు కూడా శాపంగా మారింది. గత 2023లో జరిగిన ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు.
ఇక, గత ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒక్కంటంటే ఒక్కటి కూడా దక్కించుకోలే క పోవడంతో 17 పార్లమెంటు సీట్లలో కారుకు పంక్చర్లయ్యాయి. అయితే.. గెలుపు అక్కడితో పోలేదు.. ఓట మి శాశ్వతమూ కాదు. మరో నాలుగేళ్లలో మళ్లీ ఎన్నికలు వున్నాయి. వస్తాయి కూడా. కానీ, ఆనాడు.. కేసీఆర్ ను వెంటబడి.. వెంబడించి.. ఆయనకు జేజేలు కొట్టిన నాయకులు.. టికెట్లు దక్కించుకున్న నాయకులు ఓటమి తర్వాత.. ఆయనకు కనీసం మొహం కూడా చూపించకపోవడం గమనార్హం.
అయితే.. వీరిలో ఏమీ చిన్న చితకా నాయకులు ఉన్నారని అనుకుంటే పొరపాటే. పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు. ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావు కేసీఆర్ వెంటే తిరిగారు. టికెట్ దక్కించుకున్నారు. కానీ, ఓటమి తర్వాత.. మొహం చూపించలేదు. పార్టీ ఆఫీసు మెట్లు కూడా ఎక్కలేదు. ఈయనొక్కరే కాదు.. భువనగిరి టికెట్ కోసం పట్టుబట్టి మరీ దక్కించుకున్న క్యామ మల్లేష్ ఈ జాబితాలోనే చేరారు.
అంతేకాదు.. వారు మాత్రమే కాదు.. చేవెళ్ళ నుంచి పోటీ చేసిన కాసాని జ్ఞానేశ్వర్, పాలమూరు నుంచి పోటీ చేసిన మన్నె శ్రీనివాస రెడ్డి, హైదరాబాద్ ఎంపీ సీటు నుంచి పోటీ చేసిన గడ్డం శ్రీనివాస్ యాదవ్, మెదక్ నుంచి పోటీ చేసి ఓడిన వెంకట్ రాంరెడ్డి, ఆదిలాబాద్ నుంచి పట్టుబట్టి మరీ టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ నేత ఆత్రం సక్కు ఇలా చెప్పుకొంటూ పోతే.. ఎందరో నాయకులు కేసీఆర్ కు ఇప్పటివరకు మొహం చూపించలేదని పార్టీ వర్గాల్లోనే చర్చసాగుతోంది. వీరంతా కేసీఆర్కు ఆత్మీయులు, ఆత్మ బంధువులు కావడం గమనార్హం. మరి వీరిని నమ్ముకునే వచ్చే ఎన్నికలకు వెళ్తారో.. లేక పంథా మార్చుకుంటారో చూడాలి.