కేసీఆర్ కుటుంబం తన అక్కసును, అసలు రూపాన్ని బయటపెట్టుకుంది. పదవి లేకుండా తన కూతురును చూడలేకపోయిన కేసీఆర్… ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టడంతో పాటు తనకు నచ్చని వారిని ఊడబీకే పని మొదలుపెట్టారు.
2019 నుంచి ఈటెలపై కోపంతో ఉన్న కేసీఆర్ అతను బీసీ కావడంతో ఎన్నికలు ముగిసే దాకా సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే తన బాకా చానెల్ లో బీసీ మంత్రిపై భూకబ్జా ఆరోపణలు మొదలుపెట్టారు.
అసలు తెలంగాణలో ఎవరెవరు దోపిడీ చేస్తున్నారో ప్రజలందరికీ తెలిసిన సంగతే. కొత్తగా టి ఛానెల్ చూసి నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదు. సొంత మంత్రి వర్గంలో మంత్రిపై భూకబ్జాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు అన్న కొత్త ప్రశ్న ఇపుడు అందరినీ వేధిస్తోంది.
మంత్రి ఈటెల భారీగా భూకబ్జాలకు పాల్పడ్డారన్నది కేసీఆర్ సర్కారు ఆరోపణ. నిన్న టి ఛానెల్లో వార్తలు రావడం నేడు పోలీసు బలగాలతో అతని ఆస్తులపై తనిఖీలు జరగడం మొదలైంది. వీటన్నింటిపై ఈటెల రాజేందర్ స్పందించారు.
తనపై వచ్చిన ఆరోపణను తీవ్రంగా తప్పుపట్టిన ఈటెల.. వ్యవస్థలో ఉన్న అన్ని విచారణ సంస్థల చేత తన మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పాటు.. సీబీఐ చేత కూడా విచారణ చేయించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే దీనర్థం ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుంది.
తాజా పరిణామాలు అన్నీ గమనిస్తే… ఈటెల మీద వేటు ఖాయమన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. అయితే, రాజకీయంగా అది మచ్చగా మిగలకుండా ఈటెలతో పాటు మరికొందరిపై వేటు వేయనున్నారు అని తెలుస్తోంది. కనీసం ముగ్గురిని మంత్రి వర్గం నుంచి తొలగించే అవకాశం ఉంది. కొత్త మంత్రుల్లో కచ్చితంగా కేసీఆర్ కూతురికి పదవి దక్కనుంది అంటున్నారు.
ఈటెల లాంటి బలమైన ప్రజాదరణ ఉన్న నేతను తొక్కేయడం ద్వారా తనతో పెట్టుకుంటే ఎంతటి వారికైనా తిప్పలు తప్పవన్న సందేశాన్ని పంపడమే కేసీఆర్ ఉద్దేశంగా తెలుస్తోంది. చాలామంది ఇవన్నీ తాజా పరిణామాలు అనుకుంటున్నారు. కానీ ఈటెలపై వేటుకు ఏడాది కింద నుంచే ప్లానింగ్ మొదలైంది.