తెలంగాణ అధికార పార్టీ.. టీఆర్ ఎస్పై ఎవరు ఔనన్నా.. కాదన్నా.. `దొరలపార్టీ` అనే ముద్ర పడింది. దీనికి కారణం.. సీఎం కేసీఆర్ వెలమ సామాజిక వర్గానికి నాయకుడు. పైగా.. ఇతర వర్గాలను ఆయన పెద్దగా ప్రాధా న్యం ఇవ్వరనే పేరు కూడా ఉంది. అయితే.. ఇప్పుడు ఈ పప్పులు ఉడకడం లేదని అంటున్నారు పరిశీల కులు. ఎందుకంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రెడ్డి వర్గాన్ని తనవైపు తిప్పుకోవడమే కాకుం డా.. తన పార్టీ రెడ్డి వర్గానికి అనుకూలమే.. అనే మాట అనిపించుకునేందుకు కేసీఆర్ తహతహ లాడుతు న్నారని అంటున్నారు పరిశీలకులు.
తన పార్టీకి రెడ్డి ముద్ర కోరుకోవడం వెనుక.. ఒక్క హుజూరాబాద్ ఉప పోరే కాకుండా.. షర్మిల పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా కోరుకుంటున్నారని చెబుతున్నారు. విషయంలోకివెళ్తే.. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓట్లు 22,600 ఉండగా వారు ప్రాబల్యం చూపే ఓట్లు అత్యంత కీలకమని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. దీనికి తోడు.. మాజీ మంత్రి, ప్రస్తుతం కేసీఆర్ అత్యంత బద్ధ శత్రువుగా భావిస్తున్న ఈటల రాజేందర్.. సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో జమున రెడ్డి వర్గాన్ని ఈటలకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో రెడ్డి వర్గం కనుక.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చక్రం తిప్పితే.. దళిత బంధు వంటివి పార్టీని ఏమాత్రం కాపాడే పరిస్థితి లేదని.. కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రెడ్డి వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు కేసీఆర్… ప్రయత్నాలు చేస్తున్నారని.. స్థానికంగా భారీ చర్చ సాగుతోంది. హుజూరాబాద్‌లో రెడ్డి సంఘం భవన నిర్మాణం కోసం ఎకరం స్థలాన్ని కేటాయించడంతోపాటు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి ఈ నెల 25న శంకుస్థాపన కార్యక్రమాన్ని ఖరారు చేశారు. రెడ్డి సంఘం ఆత్మీయ సమావేశాన్ని జమ్మికుంట మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు తన్నీరు హరీశ్‌రావు తదితరులు హాజరు కానున్నారు.
మరోవైపు.. వైఎస్ తనయ.. షర్మిల పెట్టిన పార్టీకి ఇప్పటికిప్పుడు ఆదరణ లేకపోయినా.. ఎన్నికల సమయానికి రెడ్డి వర్గంలో అసంతృప్తి పెరిగితే.. కష్టమని.. కేసీఆర్ భావిస్తున్నారు. వైఎస్ అభిమానులు.. ఆయన హయాంలో లబ్ధి పొందిన వారు చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. సో.. వీరిని గాడి తప్పకుండా చూసుకునే క్రమంలోనూ కేసీఆర్ వ్యూహాత్మకంగా.. రెడ్డి వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఈ పెద్దిరెడ్డి , కౌశిక్‌రెడ్డి వంటివారిని పార్టీలోకి తీసుకున్నారని.. చెబుతున్నారు. వీరిలో కౌశిక్‌రెడ్డికి ఏకంగా ఎమ్మెల్సీని చేయాలని అనుకున్నారని అంటున్నారు. మరి.. కేసీఆర్ ప్రయత్నాలతో టీఆర్ ఎస్పై రెడ్డి ముద్ర పడుతుందో లేదో.. చూడాలి.