కేసీఆర్ కారులో యశోదా ఆసుపత్రికి వచ్చారు. కరోనా వచ్చినప్పుడు ఆసుపత్రిలో చూపించుకోవటానికి కారులో రాక దేన్లో వస్తారన్న క్వశ్చన్ రావొచ్చు. నిజమే.. అంతకు మించిన మరో మార్గం ఏముందన్న ఆలోచన రానంతవరకు కారులో రావటం తప్పుగా అనిపించక పోవచ్చు.
కానీ.. యశోదాకు వచ్చిన క్రమాన్నిచూసినప్పుడు.. ఆయన ప్రోగ్రాంను ప్లాన్ చేసిన వారికి రావాల్సిన ఆలోచన రాకపోవటం.. ఒకవేళ అధికారులకు రాకున్నా.. కేసీఆర్ లాంటి మనసున్న మేధావికి రాకపోవటమే ఇక్కడ ఇబ్బంది.
కరోనా మహమ్మారి కేసీఆర్ ను పట్టేసినప్పటికి.. ఆయనకు వైరస్ లోడ్ తక్కువనే చెబుతారు. దీంతో.. హోం ఐసోలేషన్ తోనే స్వస్థతకు చేకూరింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆయనకు అవసరమైన సిటీ స్కాన్ కోసం ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తన పరివారంతో కలిసి బయలుదేరి రావటం తెలిసిందే.
అయితే.. ఆయన కారులో రావటం.. ముందు సీట్లో కూర్చోవటంతోనే సమస్యంతా. పాంహౌస్ కు యశోదా ఆసుపత్రికి మధ్య ప్రయాణ దూరం తక్కువలో తక్కువ 40 నుంచి 60 నిమిషాలకు పైనే ఉంటుంది.రానుపోను సమయం లెక్కిస్తే రెండు గంటలకు పైనే ప్రయాణం ఉంటుంది.
సీఎం ప్రయాణిస్తున్న కారు అన్నప్పుడు.. అద్దాలు మూసి ఉంచుతారే తప్పించి.. తెరిచి ఉంచరు. అంటే.. వైరస్ వ్యాపించేందుకు ఉన్న అవకాశం చాలా ఎక్కువ. అందునా.. కారులోకేసీఆర్ తో పాటు.. డ్రైవర్ ఉంటారు. కారులో రాజ్యసభ సభ్యుడు సంతోష్ ఉన్నట్లుగా ఆసుపత్రిలోని వారు చెబుతున్నారు. ఈ వాదనకు తగ్గట్లే.. యశోదా ప్రయాణం తర్వాత పాజిటివ్ బారిన పడినట్లుగా వార్తలు వచ్చాయి.
కరోనా పాజిటివ్ గా ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న తేడా కొట్టినా.. మిగిలిన వారికి కరోనా అంటుకుంటుంది. సామాన్యులకైతే కారు.. అంబులెన్సు లాంటి వాహనాలే దిక్కు.
కానీ.. సీఎం కేసీఆర్ లాంటి వారికిమాత్రం అంతకు మించిన ఏర్పాట్లు చేసుకునే వీలు ఉంటుంది. జిల్లాల్లో తిరిగేందుకు.. ఏదైనా సభలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. ఖరీదైన బస్సును ఆ మధ్యన సిద్ధం చేసుకోవటం తెలిసిందే.
కరోనా నేపథ్యంలో యశోదాకు వచ్చే వేళలో.. కారులో కాకుండా..ప్రత్యేక బస్సును వినియోగించి ఉంటే కేసీఆర్ తో పాటు ఉన్న వారు మరింత క్షేమంగా ఉండేవారన్నది మర్చిపోకూడదు. మనసున్న మనిషిగా.. సున్నిత మనస్కుడిగా కేసీఆర్ ను తరచూ అభివర్ణిస్తుంటారు.
అలాంటివేళ.. తాను కారులో ప్రయాణించటం ద్వారా.. కారు డ్రైవర్ తో పాటు.. తన వెంటే ఉండే సంతోష్ లాంటి వారికి ముప్పు ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు ఆలోచించనట్లు? అన్న సందేహం కలుగక మానదు.
కారులో కాకుండా యశోదాకు బస్సులో వచ్చి ఉంటే.. బాగుండేదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేయటం గమనార్హం. ఇదే సమయంలో ఆయన్ను తప్పు పట్టే వారు మాత్రం.. కాస్తంత కఠినంగా కేసీఆర్ కు కనికరం లేదా? యశోదాకు కారులోనే రావాలా? అన్న మాటను అనేస్తున్నారు.