తెలంగాణ రాష్ట్రంలో సిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రుల దందాకు.. వారి ధన కాంక్షకు సామాన్యులు.. మధ్యతరగతి వారు బలైపోతున్నారు. వైద్యం కోసం కిందామీదా పడటం.. ఆసుపత్రుల్లో వైద్యం దొరికిన తర్వాత.. ఆ బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురి కావటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.
మరోవైపు.. కొన్ని ఆసుపత్రుల దుర్మార్గం తీవ్రంగా ఉండటమే కాదు.. మరీ ఇంత అరాచకమా? అన్న భావన కలిగేలా చేస్తోంది.
చనిపోయిన తర్వాత తాము చెప్పినంత మొత్తాన్ని చెల్లించకుంటే శవాన్ని ఇవ్వమని చెప్పటమే కాదు.. మూడు రోజుల పాటు ఆసుపత్రి సెల్లార్ లో ఉంచి వైనం సంచలనంగా మాత్రమే కాదు.. షాకింగ్ గా మారింది.
ఈ ఉదంతంపై తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ రియాక్టు అయ్యారు. ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరోనా కష్టకాలాన్ని కార్పొరేట్.. ప్రైవేటు ఆసుపత్రులు కాసులు సంపాదించుకునేందుకు వాడుకోవటం సరికాదన్నారు.
బిల్లు కట్టకపోతే డెడ్ బాడీలను బంధువులకు ఇవ్వరా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. కరోనా పేషెంట్లకు ఎంత ఛార్జీ వేయాలో..గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన జీవో ద్వారా తెలియజేసిన వైనాన్ని గుర్తు చేశారు.
ఆ జీవో ఇప్పటికి అమల్లో ఉందని.. అయినప్పటికీ ఆసుపత్రులు ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లుగా ఫైర్ అయ్యారు.
అదేంది ఈటెల సాబ్? మీరేమీ విపక్ష నేత కాదు.. ఆవేశాన్ని మాటలకే పరిమితం చేయటంలో ఉద్దేశం ఏమిటి?
చేతిలో బోలెడంత అధికారం ఉన్న వేళ.. నోటిని వాడే కన్న.. చేతల్లో చేసి చూపిస్తే సరిపోతుంది కదా? ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రులపై చర్యల కొరడాను విదిలిస్తే.. సీన్ సెట్ అయ్యే అవకాశం అంతో ఇంతో ఉంది కదా? అది వదిలేసి.. ఎన్ని ఆగ్రహా ఆవేశాల్ని ప్రదర్శిస్తే మాత్రం ఫలితం ఉంటుందా చెప్పండి?