తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘కంగువ’ సినిమా మీద విడుదలకు ముందు ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కోలీవుడ్ నుంచి తొలి వెయ్యి కోట్ల సినిమా ఇదే అవుతుందనేంత హైప్ కనిపించింది. కానీ రిలీజ్ తర్వాత అందులో పదో వంతు వసూళ్లు రాబట్టడం కూడా గగనంగా మారింది. ఇంత పెద్ద డిజాస్టర్ అయి, తీవ్ర విమర్శలకు గురైన సినిమా.. ఇప్పుడు ఇండియా తరఫున ఆస్కార్ నామినేషన్‌కు షార్ట్ లిస్ట్ కావడం పెద్ద షాక్.
శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పెట్టి సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం.. నిర్మాతతో పాటు బయ్యర్లనూ గట్టి దెబ్బే తీసింది. సినిమా డిజాస్టర్ కావడం ఒకెత్తయితే.. దీని గురించి సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ మరో ఎత్తు. ఇది టీంను ఇంకా కుంగదీసింది.
ప్రతి ఏడాదీ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఇండియా నుంచి ఓ చిత్రాన్ని నామినేట్ చేస్తారన్న సంగతి తెలిసిందే.
గత ఏడాది ఇండియాలో తెరకెక్కిన చిత్రాల్లో అకాడమీ మార్గదర్శకాలకు తగ్గట్లుగా 197 చిత్రాలు ఉండగా.. అందులోంచి ఐదు చిత్రాలను నామినేషన్ కోసం షార్ట్ లిస్ట్ చేశారు. వీటిలో ‘కంగువ’తో పాటు మలయాళ చిత్రాలు ‘ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్’, ‘ది గోట్ లైఫ్’.. హిందీ మూవీస్ ‘సంతోష్’, ‘స్వతంత్ర వీర సావర్కార్’, ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ ఉన్నాయి. ఐతే ‘కంగువ’ను ఏ కోణంలో ఈ లిస్టులోకి ఎంపిక చేశారో కానీ.. దాని ఇండియా నుంచి నామినేట్ కావడం కష్టమే.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ‘ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమాకే ఎక్కువ స్కోప్ ఉంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా మెచ్చడం విశేషం. పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్రం ‘ది గోట్ లైఫ్’ కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. అది కూడా గట్టి పోటీనిచ్చే అవకాశముంది.