స్టార్ హీరోలను సింపుల్‌గా వాళ్ల పేర్లు పెట్టి పిలవడం అభిమానులకు ఇష్టం ఉండదు. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. నిన్నా మొన్నా వచ్చిన, స్టార్ ఇమేజ్ లేని హీరోలకు కూడా ఈ ట్యాగ్స్ పెట్టేస్తున్న నేపథ్యంలో స్టార్ హీరోలకు ట్యాగ్స్ ఉండడంలో తప్పేంటని భావిస్తారు అభిమానులు. కానీ అందరు హీరోలూ ఇలాంటి ట్యాగ్స్ కోరుకోరు. తాజాగా దిగ్గజ నటుడు కమల్ హాసన్ తనను అభిమానులు సింపుల్‌గా పేరుతో పిలిస్తే సరిపోతుందంటూ ఒక నోట్ రిలీజ్ చేశారు.
కమల్‌ను తమిళ అభిమానులు ‘ఉలగనాయగన్’ అని, తెలుగు ఫ్యాన్స్ ‘లోకనాయకుడు’ అని పిలుచుకుంటారు అన్న సంగతి తెలిసిందే. తనకీ ట్యాగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూనే.. ఇక నుంచి తన పేరు వెనుక ఆ మాటను తీసేయాలని కమల్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొంచెం సుదీర్ఘంగానే ఆయన నోట్ విడుదల చేశారు.
కోట్లాది మంది అభిమానులు తన మీద ఎంతో ప్రేమను కురిపిస్తూ ‘ఉలగనాయగన్’ అనే బిరుదు ఇచ్చారని.. అందుకు తాను కృతజ్ఞుడని కమల్ తెలిపారు. కానీ ఎంత అనుభవం సాధించినా.. ఇప్పటికీ తాను ఒక నిత్య విద్యార్థి లాగే సినిమా అనే కళ గురించి మరింత నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని.. ఆ ప్రయత్నం ఎప్పటికీ ఆగదని కమల్ తెలిపారు.
ఐతే ఎవ్వరూ కూడా కళ కంటే పెద్ద వాళ్లు కాదని.. తాను కూడా అందుకు మినహాయింపు కాదని.. కాబట్టి ఇలాంటి బిరుదులతో తనను పెద్దవాడిని చేయొద్దని కమల్ తెలిపారు. తనను కమల్ హాసన్ అని కానీ.. కమల్, కేహెచ్ అనే షార్ట్ నేమ్స్‌తో కానీ పిలిస్తే సరిపోతుందని కమల్ విన్నవించారు. ఇకపై తన పేరు వెనుక ‘ఉలగనాయగన్’ లాంటి బిరుదులు వద్దని ఆయన వినమ్రంగా తెలియజేశారు. కొందరు హీరోలు అభిమానులు ఇవ్వకపోయినా.. తమకు తాముగా ట్యాగ్స్ వేసుకునే పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడు ఇలాంటి విజ్ఞప్తి చేయడం గొప్ప విషయం.