ఇంకో 12 రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతోంది కన్నడ చిత్రం ‘కబ్జ’. కన్నడ సినిమా చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైన ఉపేంద్ర హీరోగా నటించిన చిత్రమిది. ఇందులో కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ లాంటి టాప్ స్టార్లు ముఖ్య పాత్రలు పోషించారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకోగా.. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు. అది చూసి అందరూ వావ్ అనుకుంటున్నారు.
1945 నాటి నేపథ్యంలో సాగే ఈ కథను భారీ బడ్జెట్లోనే తీసినట్లున్నారు. ఇందులో విజువల్స్.. యాక్షన్ సీక్వెన్సులకు సంబంధించిన షాట్లు ఔరా అనిపిస్తున్నాయి. ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్ థింగ్ అంటూ ట్రైలర్లో మేకర్సే వేసుకున్నారు. ఇది వాళ్ల కాన్ఫిడెన్స్‌కు అద్దం పట్టేదే. చూస్తుంటే సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించేలాగే కనిపిస్తోంది. కానీ ఈ సినిమాకు ఓ పెద్ద సమస్య ఉంది.
‘కబ్జ’కు సంబంధించి ఏ ప్రోమో చూసినా అందులో ‘కేజీఎఫ్’ ఛాయలు కనిపిస్తుండటమే ఆ సమస్య. సినిమాటోగ్రఫీ యాజిటీజ్ ‘కేజీఎఫ్’ స్టయిల్లోనే ఉంది. ఇది ‘కేజీఎఫ్’ తరహాలోనే పీరియడ్ మూవీనే కావడం.. సినిమాలో కనిపించే పాత్రల లుక్స్ అన్నీ కూడా దాన్ని తలపించేలా ఉండటం.. ట్రైలర్ ఎడిటింగ్ కూడా ‘కేజీఎఫ్’ ప్యాటర్నే కావడంతో రియల్ కిక్కు రావట్లేదు. ‘కేజీఎఫ్’ రాకముందే ఈ ట్రైలర్ చూసి ఉంటే వారెవా అనుకునేవాళ్లం.
కానీ ఇప్పుడు ట్రైలర్ ఎంత అద్భుతంగా అనిపించినా కూడా.. మరో సినిమాను అనుకరించినట్లే అనిపిస్తోంది. ఒరిజినల్ ఫీలింగ్ రావట్లేదు. రేప్పొద్దున సినిమా చూస్తున్నపుడు కూడా జనాలకు ఇదే ఫీలింగ్ కలుగుతుందేమో. ఇంత పెద్ద సినిమా తీస్తున్నపుడు.. మరో సినిమాతో పోలిక రాకుండా కొంచెం భిన్నంగా ఏదైనా ట్రై చేసి ఉండాల్సింది. మరి ‘కేజీఎఫ్’తో పోలికలను అధిగమించి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుందేమో చూడాలి.