ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. మొత్తం 5 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతోనే.. జనసేన నుంచి నాగబాబు పేరును ప్రధమంగా ప్రకటించారు. నిజానికి కూటమిలో చర్చించి.. అన్నిపార్టీల నిర్ణయం, అభ్యర్థుల వడపోత వంటివి పరిగణనలోకి తీసుకున్నాక ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, నాగబాబు పేరును అనూహ్యంగా ప్రకటించారు.
ఇక, తాజాగా నామినేషన్ కూడానాగబాబు దాఖలు చేశారు. ఇది కూడా అందరికన్నా ముందే కావడం గమనా ర్హం. శుక్రవారం మధ్యామ్నం 1.30 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నామినేషన్‌కు మద్దతుగా.. మంత్రి నారా లోకేష్, బీజేపీ పక్ష నాయకుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంతకాలు చేశారు.
అనంతరం.. సచివాలయంలోని ఎన్నికల అధికారి.. వనితారాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలను అందించారు. మొత్తంగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన సమర్పించారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూతో ఒకటి తిరస్కరణకు గురైనా రెండోది ఆమోదం పొందుతుందన్న ఉద్దేశంతో రెండు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం.. నాగబాబు మీడియాతో మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలు గమనిస్తున్నారని అందుకే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను కూటమి కైవసం చేసుకుందున్నారు. ప్రజలకు ఏం చేయాలో .. కూటమికి బాగా తెలుసునన్న ఆయన.. ప్రభుత్వంలో తాను కూడా భాగస్వామ్య మయ్యే రోజు త్వరలోనే ఉందన్నారు. కాగా.. నాగబాబుకు సీఎం చంద్రబాబు మంత్రి పదవిని ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే ఉగాది తర్వాత.. మంత్రి వర్గంలో ఆయనకు చోటు కల్పించనున్నారు.