డ్రగ్స్ రాకెట్ ఉచ్చు.. ఏపీ సీఎం జగన్ మెడకు చుట్టుకుంటోందా? ఆయన వైపు వేళ్లన్నీ చూపిస్తున్నాయా. ? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. అఫ్ఘానిస్థాన్ నుంచి విజయవాడకు అక్రమంగా రవాణా అవుతూ గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో ఇటీవల పట్టుబడిన 2,988.21 కిలోల హెరాయిన్ విలువ సుమారు రూ.21 వేల కోట్లుగా డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు తేల్చారు. అయితే.. ఇప్పుడది రూ.71 వేల కోట్లుగా చెబుతున్నారు. తొలుత దీని విలువ తొమ్మిది వేల కోట్లుగా అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కేజీ రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.
విజయవాడ అడ్రస్‌తో కలకలం..
పట్టుబడిన డ్రగ్స్‌కు సంబంధించిన విషయాలను పరిశీలించిన అధికారులు దీని మూలాలలు.. ఏపీలో ఉన్నాయని గుర్తించారు. అంతేకాదు.. విజయవాడలోని ఆశి ట్రేడింగ్ కంపెనీ కార్యకలాపాలను చెన్నై నుంచి నిర్వహిస్తున్న మాచవరపు సుధాకర్(45), దుర్గా వైశాలి దంపతులను డీఆర్ఐ అధికారులు చెన్నైలో అరెస్టు చేశారు. వారిద్దరినీ గుజరాత్‌లోని భుజ్ పట్టణానికి తరలించారు. భుజ్‌లో ఎన్‌డీపీఎ్‌స(నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్) కేసులు విచారించే ప్రత్యేక కోర్టు వీరిద్దరినీ 10 రోజుల డీఆర్ఐ కస్టడీకి అప్పగించింది.
ఈడీ పరిశోధన..
ఈ వ్యవహారంపై ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దృష్టి సారించింది. హెరాయిన్ వెనుక ఉన్న వ్యక్తులు, సిండికేట్ల గురించి దర్యాప్తు చేస్తామని, అవసరమైతే నిందితుడి ఆస్తులను అచాచ్ చేస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి. కాగా, డ్రగ్ స్మగ్లింగ్‌కు మోదీ, అమిత్‌షాల సొంత రాష్ట్రం గుజరాత్ ప్రధాన కేంద్రంగా ఎందుకు మారిందో బీజేపీ చెప్పగలదా? అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మంగళవారం ఢిల్లీలో ప్రశ్నించారు. కాగా, ఎగుమతి, దిగుమతులకు లైసెన్సు పొందడానికి విజయవాడలోని ఇంటి అడ్ర్‌సను వాడుకోవడం తప్ప.. నగరంలో ఆశి ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలేవీ ఇప్పటి వరకూ వెలుగులోకి రాలేదని విజయవాడ పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు చెప్పారు.
టీడీపీ దూకుడు..
ఇక, డ్రగ్స్ విషయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూకుడు పెంచింది. డ్రగ్స్ రాకెట్ లో కీలక సూత్రధారి సుధాకర్ వైసీపీ ఎమ్మెల్యే బంధువేనని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఏపీని నేరస్థుల అడ్డాగా మార్చిందన్నారు. 72 వేల కోట్ల హెరాయిన్ గ్యాంగ్ వెనక బిగ్ బాస్ ఎవరో చెప్పాలని బొండా ఉమ డిమాండ్ చేశారు. ఏపీ పోలీసులు ఈ డ్రగ్స్ పై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీ పోలీసులకు అంతా తెలిసి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని బొండా ఉమ అన్నారు. డ్రగ్స్ పై టీడీపీ మాట్లాడితే కొడాలి నాని ఎందుకు ఉలిక్కిపడతారని ఆయన అన్నారు. మరి ఈ విషయం మున్ముందు.. సీఎం జగన్ వరకు వెళ్తుందా? ఇక్కడితో ఆగిపోతుందా? చూడాలి.