జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత అమరావతి రాజధాని అంతమే లక్ష్యంగా పావులు కదిపిన సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో అమరావతిపై జగన్ మాట్లాడిన మాటలకు…వాస్తవాలకు నక్కకూ..నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అమరావతిని అంతం అనే పంతం పట్టిన జగన్…మూడు రాజధానుల మంత్రం జపిస్తున్నారని ఇట్టే అర్థమవుతుంది. కేవలం టీడీపీని దెబ్బకొట్టేందుకు అమరావతి ప్రాంతం మీద ఇంత విషం చిమ్ముతున్న జగన్ చట్టసభలో కూడా పచ్చి అబద్ధాలాడుతున్న వైనంపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రానికి రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని గతంలో ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభ సాక్షిగా ప్రకటించిన జగన్ ..నేడు సీఎం అయిన తర్వాత అదే అసెంబ్లీలో నిలబడి అడ్డగోలుగా మాట్లాడుతున్న వైనం ఆశ్చర్యం కలిగించకమానదు. ‘అబద్ధాలాడితే ఎవరికైనా చెప్పులు, చీపుర్లు చూపించాలి. నాకైనా అదే వర్తిస్తుంది’.. అని స్వయంగా జగన్ చెప్పిన డైలాగ్ ఆయనకు కూడా వర్తిస్తుందన్న సంగతి మరచినట్లున్నారు. ఈ క్రమంలోనే అమరావతిపై జగన్, వైసీపీ నేతలు చెబుతున్న మాటలు..అసలు వాస్తవాలు ఏమిటి అన్నదానిపై సర్వత్రా చర్చ మొదలైంది.
అమరావతి నిర్మాణానికి రూ.1.10 లక్షల కోట్లు కావాలి…కనీసం వందేళ్లు పడుతుంది…ఆ మొత్తం డబ్బంతా తెచ్చి అమరావతిలోనే పెట్టాలా? మూడు రాజధానులంటే…రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ఇది, వైసీపీ నేతలు చెబుతున్న మాటలు.
కానీ, వాస్తవం మరోలా ఉంది. అమరావతి నిర్మాణానికి ప్రభుత్వమే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలన్న రీతిలో వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, అమరావతి ఒక పూర్తి అభివృద్ధి చెందిన నగరంగా రూపుదిద్దుకోవడానికి రూ.1.09 లక్షల కోట్లు అవసరమని సీఆర్డీఏ అంచనా వేసింది. ముందుగా కొంత ఖర్చుపెట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తే…మిగతా డబ్బంతా సెల్ఫ్ ఫైనాన్సింగ్ గా తెచ్చుకునే కెపాసిటీ అమరావతికి ఉంది.
అమరావతిలో ఉన్నవన్నీ తాత్కాలిక భవనాలేనంటూ వైసీపీ నేతలు మరో విష ప్రచారం ముమ్మరంగా చేస్తుంటారు. కానీ, అసలు నిజం వేరేలా ఉంది. రాజధానిలోని సచివాలయ భవనాలు, శాసనసభ భవనం టెంపరరీ కాదు. ఆ భవనాల పేరు ‘ఇంటెరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్’. ఆ భవనాలు శాశ్వతం. కేవలం తాత్కాలికంగా పనిచేస్తున్నాం కాబట్టి ఆ పేరు పెట్టారు.
ఇక, వైసీపీ నేతల మరో అందమైన, బలమైన అబద్ధం ఇది. కమ్మ సామాజిక వర్గం ప్రయోజనాల్ని కాపాడేందుకే అమరావతి నిర్మాణం చంద్రబాబు చేపట్టారు. కానీ, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. తాడికొండ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అమరావతి వాస్తవానికి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. రాజధానికి భూములిచ్చినవారిలో ఎస్సీ, ఎస్టీలు 32%, రెడ్లు 23%, కమ్మ 18%, బీసీలు 14%, కాపులు 9%, మైనార్టీలు 3%, ఇతరులు 1% ఉన్నారు. ఇవి, పక్కా గణాంకాలు. అయినా సరే అమరావతి కమ్మ సామాజికవర్గానిదని విషప్రచారం చేయడం మిగతా వర్గాల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగునా? అన్న సందేహాలు వ్యక్తం కాక మానవు.
రాజధాని అమరావతి పై తాజాగా మొన్న అసెంబ్లీ సాక్షిగా… జగన్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే… కేవలం అమరావతిని అంతం చేసేందుకే మూడు రాజధానుల మంత్రం పఠిస్తూ… ప్రజలను మోసం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. లేకపోతే ఒక ప్రాంతం మీద ఇంత విషం చిమ్మడమా? చట్టసభలో ఇన్ని పచ్చి అబద్ధాలా?! pic.twitter.com/3OrY0wBwIG
— Telugu Desam Party (@JaiTDP) September 19, 2022