చంద్రబాబునాయుడు ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని, తన కులానికి చెందిన వారికి పదవులు, ప్రమోషన్లు కట్టబెట్టారని జగన్ తో పాటు వైసిపి నేతలంతా గతంలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే, జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికి అన్ని పదవులు కట్టబడుతున్న వైనం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసు శాఖలో డిఎస్పి ప్రమోషన్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఆ ప్రమోషన్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి జగన్ పెద్దపీట వేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై టిడిపి సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. టిడిపి హయాంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు కట్టబెట్టలేదని హోం మంత్రి సుచరిత అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గోరంట్ల గుర్తు చేశారు. డీఎస్పీల ప్రమోషన్లలో చంద్రబాబు ఎవరికి అన్యాయం చేయలేదని సుచరిత లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చిన విషయాన్ని గోరంట్ల గుర్తు చేశారు.
ఈ క్రమంలోనే చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేసిన జగన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని గోరంట్ల డిమాండ్ చేశారు. తాజాగా 53 మంది డిఎస్పి లకు పోస్టింగ్ ఇచ్చారని, అందులో 25 శాతం మంది జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారని గోరంట్ల ఆరోపించారు. మొత్తం 29 మందిలో 19 మంది రెడ్డి సామాజిక వర్గం వారున్నారని, కాపులకు ఒక్క పోస్టింగ్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
తన సొంత సామాజిక వర్గాన్ని పెంచి పోషిస్తున్న జగన్ బడుగు బలహీన వర్గాలను జెసిబిలతో రోడ్డు రోలర్లతో అణగదొక్కుతున్నారని విమర్శించారు. సలహాదారులలో, చట్టసభలో పదవుల్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి శాఖలో అంతా జగన్ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశాలు దక్కుతున్నాయని ఆరోపించారు. జగన్ తన కులపిచ్చతో ఎనిమిది వందల నామినేటెడ్ పోస్టులను తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారని గోరంట్ల ఆరోపించారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేసిన పోలీసులకు ఇప్పుడు పోస్టింగ్లు ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపించారు.