151 సీట్లు సాధించిన పార్టీ పెర్ఫామెన్స్ బాలేకుంటే సీట్లు వందకు తగ్గొచ్చు. పాలన మరీ పేలవం అనుకుంటే 50 సీట్లకు కూడా పడిపోవచ్చు. కానీ మరీ 11 సీట్లకు పరిమితం కావడం ఏంటి..? జగన్ మరీ అంత చెత్తగా పరిపాలించాడా అని వైసీపీ లో అంతర్మథనం నడుస్తోంది ఇప్పుడు. ఓటమికి కారణాలుగా చెప్పుకుంటే చాలానే కనిపిస్తున్నాయి.
బేసిగ్గా సంక్షేమం.. జనం అకౌంట్లలో డబ్బులు అనే ఒక్క పాయింట్ పట్టుకుని ఎన్నికలకు వెళ్లిపోయింది వైసీపీ. అభివృద్ధిని పూర్తిగా విస్మరించడం.. వైసీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలు శ్రుతి మించడంతో ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. విడి విడిగా ఒక్కో కారణం చెప్పుకుంటూ పోతే చాలా కనిపిస్తాయి. ఐతే వైసీపీ వాళ్లు ఈ వైఫల్యాలను ఒప్పుకుంటూనే.. ఓటమికి పార్టీ వైపు నుంచి ప్రధాన కారణంగా ఒక వ్యక్తిని చూపిస్తున్నారు. ఆయనే.. సజ్జల రామకృష్ణారెడ్డి.
వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం పూర్తిగా చచ్చిపోయిందని.. జగన్ తన కోసం కష్టపడ్డ నేతలు, కార్యకర్తలను పట్టించుకోకపోవడమే వాళ్లంతా ఎన్నికల్లో శాయశక్తులా కష్టపడకపోవడానికి కారణమని.. జగన్‌కు నేతలు, కార్యర్తలకు మధ్య సజ్జల అనే వ్యక్తి ఒక గోడ కట్టేశారని ఆయన విరుచుకుపడుతున్నారు. జగన్ అన్ని బాధ్యతలూ సజ్జలకు అప్పగించేసి.. ఆయన మాటే వింటూ మిగతా నేతలు, కార్యకర్తల మనోభావాలను పట్టించుకోలేదని.. వాళ్లకు విలువ ఇవ్వలేదని.. సజ్జల ఒక కోటరీని నడుపుతూ పార్టీని దారుణంగా దెబ్బ తీశారని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిన్నటి ప్రెస్ మీట్లో జగన్ ఆవేదన చూసి తట్టుకోలేకపోతున్నవాళ్లు ఆయనకు అండగా నిలుస్తామని అంటూనే.. ఈ ఘోర పరాభవానికి, జగన్ ఎదుర్కొంటున్న అవమాన భారానికి కారణం సజ్జలేనంటూ ఆయన మీద విరుచుకుపడుతున్నారు. ఇకనైనా సజ్జల, ఆయన తనయుడు భార్గవ్‌లకు ప్రాధాన్యం తగ్గించి నిజమైన నేతలు, కార్యకర్తలకు జగన్ చేరువ కావాలని.. వాళ్లలో స్థైర్యం నింపి జనాలకు దగ్గరవ్వాలని.. అధికార పక్షం మీద పోరాడాలని కోరుతున్నారు.