2020లో విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రమాదం మొత్తం 12 మంది ప్రాణాలను బలి తీసుకుంది. నాడు జగన్ ప్రభుత్వం ఘటనా స్థలంలో మృతిచెందిన 9 మంది కుటుంబాలకే రూ.కోటి పరిహారాన్ని ఇచ్చారు. ఆ మొత్తం ఎల్జీ కంపెనీ తన నిధుల నుంచే సమకూర్చింది.
అదే ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. కానీ వారికి పైసా పరిహారం అందలేదు. పైగా ప్రమాదం జరిగిన తర్వాత ఎల్జీ యాజమాన్యంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఏకాంతంగా సమావేశం అయ్యారు. బేరసారాలు మాట్లాడుకుని.. పాలిమర్స్‌పై లోతైన విచారణ జరపకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. దానిని ప్రశ్నించిన సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి రంగనాయకమ్మను దారుణంగా వేధింపులకు గురిచేశారు.
ఇక తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదం మరోసారి రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటనలో 17మంది చనిపోగా..50 మందికిపైగా గాయాలు పాలై ఆసుపత్రిలో చేరారు. అయితే ఫార్మా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని, అన్ని విధాలుగా అండగా నిలుస్తామని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.
అంతేకాకుండా నేటి ప్రభుత్వం నేరుగా కంపెనిని బాధ్యులను చేసి వారి చేతనే బాధితులకు నష్ట పరిహారం ఇప్పించింది. మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు అందించామని తాజాగా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం అందిస్తున్నామని పేర్కొన్నారు.