ఎన్ని ఘటనలు చిత్రంగా ఉంటాయి. వాటి మధ్య కార్యాకారణ సంబంధాలు పైకి కనిపించకపోయినా.. ఆయా ఘటనల అంతరంగ విశ్లేషణలో మాత్రం కారణాలు స్పష్టంగా గోచరమవుతాయి. ఇప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అంత్యక్రియల విషయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, రోశయ్యకు అత్యంత ఆప్తుడు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం వ్యవహరించిన తీరు వెనుక ఇలాంటి కార్యాకారణ సంబంధమే ఉందని అంటున్నారు పరిశీలకులు.
నిజానికి వైఎస్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వారిలో రోశయ్య ముందుంటారు. రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న కాంగ్రెస్‌లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన రోశయ్య వారిలో ఒకరుగా ఇమిడిపోయారు. అయితే.. వర్గ పోరు పెరిగిన తర్వాత.. వైఎస్ కు అనుకూలంగా వ్యవహరించిన రోశయ్య.. పాదయాత్ర చేయాలనే తలంపును తొలుత అంగీకరించారని కాంగ్రెస్ నాయకులు చెబుతారు.
ఇలా.. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేందుకు పడిన `తొలి అడుగు` వెనుక రోశయ్య పెద్ద వ్యూహమే ఉందని ఇప్పటికీ గుసగుస వినిపిస్తుంది. ఇలా వైఎస్-రోశయ్యల బంధం పెనవేసుకుపోయింది. రోశయ్యను అన్న అని సంబోధించిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు కూడా వైఎస్.
ఒకరకంగా చెప్పాలంటే.. ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా! వైఎస్ సతీమణి విజయమ్మ గత ఏడాది కిందట రాసుకున్న `నాలో నాతో వైఎస్సార్` పుస్తకంలోనూ.. రోశయ్య వంటి స్నేహశీలి వైఎస్‌కు దొరకడం.. రాజకీయంగా ఆయనకు కలిసి వచ్చిన ప్రధాన అంశంగా పేర్కొన్నారంటే.. రోశయ్య ఏ విధంగా వైఎస్‌తో కలిసిపోయారో అర్ధం చేసుకోవచ్చు.
అలాంటి రోశయ్య కన్నుమూస్తే.. చూసేందుకు కానీ, ఆయనకు ఒక నివాళి అర్పించేందుకు కానీ.. వైఎస్ కుటుంబం నుంచి కాలు బయట పెట్టిన వారు ఒక్కరంటే ఒక్కరు కనిపించలేదు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ తనయుడు.. జగన్ తన తరఫున ముగ్గురు మంత్రులను పంపించి చేతులు దులుపుకొన్నారు. దీంతో `ఆయన ఎందుకు రాలేదు?` అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగింది.
ఏపీ నుంచి హాజరైన వారు.. తెలంగాణలో ఉండి.. క్రతువును నడిపించిన వారు కూడా జగన్ వైపు దృష్టి పెట్టారు. అయితే.. ఎవరూ కూడా బయటపడలేదు. దీనికి కారణం.. వైఎస్ మరణానంతరం.. ముఖ్యమంత్రి కావాలని.. జగన్ తపించిపోయారు. తండ్రి పార్థివ దేహాన్ని పక్కనే పెట్టుకుని.. ఆయన సంకతాలు సేకరించారనే వాదన కూడా ఉంది.
అయినప్పటికీ.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రాజకీయ కురువృద్ధుడు రోశయ్యకు అనూహ్యంగా సీఎం పదవిని అందించింది. దీంతో జగన్ రోశయ్యే తనకు అడ్డుపడ్డారనే భావనను అణువణువునా నింపుకొన్నారు. అంతేకాదు.. తర్వాత ఆయన చేపట్టిన పాదయాత్రకు కూడా ప్రభుత్వం తరఫున అడ్డు పడింది కూడా రోశయ్య అనే భావనతోనే ఉన్నారు.
ఈ క్రమంలో రోశయ్య ఏపీ వాసి అయినప్పటికీ.. తను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ.. తర్వాత.. జరిగిన అనేక కార్యక్రమాలకు కానీ.. రోశయ్యను పిలవలేదు. ఇక, ఇప్పుడు ఏకంగా అంత్యక్రియలను కూడా జగన్ బహిష్కరించారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. ఆ రోజు తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటే… దానికి రోశయ్యే అడ్డు పడ్డారనే బావనను జగన్ విడిచిపెట్టకపోవడమేనని పరిశీలకులు అంటున్నారు. రోశయ్య అడ్డుకోవడం ఏంటి? అనుకుంటున్నారా?? జగన్ వెర్షన్ ఏంటంటే… రోశయ్య నాకు పదవి వద్దు, జగన్ కి ఇవ్వండి అని చెప్పలేదన్నది జగన్ బాధ, కోపం.
ఇదంతా చూస్తే స్పష్టంగా మనకో విషయం అర్థమవుతుంది. రోశయ్య అంత్యక్రియలకు హాజరుకాకపోవడం ద్వారా తాను సీఎం కావడానికి సంతకాలు సేకరించిన విషయం జగనే ప్రూవ్ చేసేశాడని చెబుతున్నారు. నిజానికి ఆ కోపం తప్ప రోశయ్యతో జగన్ కు వేరే విభేదాలేమీ లేవు. బయట కూడా ఏనాడూ రోశయ్య జగన్ కుటుంబపై విమర్శలు చేయలేదు. అయినా వాళ్లు అంత్యక్రియలకు రాలేదంటే ఆ రోజు సంతకాల సేకరణ పచ్చినిజం. తండ్రి శవం పక్కనే పదవికోసం పాకులాడిన మాట వాస్తవం.
దీనికి ఈరోజు జగన్ చేసిన పనే రుజువు. అని పరిశీలకులు భావిస్తున్నారు.