ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం…దైవంతో సమానమైన గురువులను సత్కరించి సన్మానించే శుభదినం ఇది. ఎంత గొప్ప స్థానంలో ఉన్న సెలబ్రిటీలు, సినీ తారలు, క్రీడాకారులు..తమ చిన్ననాటి టీచర్లను గుర్తు చేసుకొని మరీ గౌరవిస్తుంటారు. అటువంటి టీచర్స్ డే వేళ ఏపీలో మాత్రం వింత పరిస్థితి ఉంది. జగన్ ప్రభుత్వం గురువులను పూజించడం సంగతి దేవుడెరుగు…తీవ్రంగా అవమానించింది. చాలాకాలంగా టీచర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న జగన్…ఈ టీచర్స్ డేనాడు వారికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఈ నెల జీతాలు ఇంకా టీచర్ల ఖాతాలలో జమచేయకపోవడంతో ఉపాధ్యాయ దినోత్సవం నాడు టీచర్లంతా అప్పులు చేసుకుంటూ అవమానాల పాలవుతున్నారు.
టీచర్లపై సర్కారు చిన్న చూపు చూస్తోంది. టీచర్ల బదిలీ ప్రక్రియ మెరుపు వేగంతో చేశామని చెబుతోన్న జగన్ సర్కార్…వారి జీతాల వ్యవహారం మాత్రం పట్టించుకోలేదు. దీంతో, బదిలీపై వెళ్లిన 30 వేల మంది టీచర్లకు 3 నెలలుగా జీతాలు లేవు.
ఇక, టీచర్స్ డే వచ్చిన ఈ నెలలో మిగతా టీచర్లకూ జీతాలు పడలేదు. దీంతో, టీచర్స్ డేనాడు ‘బతకలేక బడి పంతులు’ అంటూ ఉపాధ్యాయులు నిరుత్సాహపడుతున్నారు. బదిలీల తర్వాత వివరాల నమోదులో ప్రభుత్వ అలసత్వం వల్ల శిక్ష టీచర్లకు పడిందని విమర్శలు వస్తున్నాయి. వివరాలు సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల 30 వేల మందికి జీతాలు పడలేదని తెలుస్తోంది.
ఇలా, ఏ ఒక్కరికీ జీతాల్లేని ‘గురుపూజోత్సవం’ ఇదేనని టీచర్లు వాపోతున్నారు. ఈ ప్రక్రియకు నెలకు మించి పట్టదని, పాఠశాల విద్యాశాఖ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క నెల జీతం రాకుంటే సర్దుకోవచ్చని, రెండో నెల, మూడో నెల కూడా జీతం రాకుంటే ఏం తిని బతకాలని, ఈఎంఐలు ఎలా కట్టాలని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండి కూడా అప్పులు, చేబదులు తీసుకోవాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందని వాపోతున్నారు. సాంకేతిక కారణాలను చూపిస్తూ ఈ నెల 1.70 లక్షల మందికి జీతాలు ఆపేసిందని ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యల కారణంగా గురుపూజోత్సవం చేసుకోవాలనే ఉత్సాహం టీచర్లలో లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.