ప్రత్యేక హోదాతోనే యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయని ఊరూరా ప్రచారం చేశారు. కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్నారు. సీఎంగా ప్రమాణం చేయకముందే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి జగన్ సాగిలపడ్డారు. తనను సీబీఐ, ఈడీ కేసుల నుంచి బయటపడేయాలని వేడుకున్నారు. హోదా మాత్రం అడగలేదు. అదేమిటని ప్రశ్నిస్తే.. బీజేపీకి మెజారిటీ వచ్చిందని.. హోదా కోసం అడుక్కోవడం తప్ప ఏమీ చేయలేమన్నారు. సంపూర్ణ మద్య పాన నిషేధమన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచి జగన్ బ్రాండ్ల పేరిట పెద్దఎత్తున విక్రయాలు చేపడుతున్నారు.
ఎన్నికల ముందు అమరావతిని సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక ధ్వంసంచేశారు. మూడు ముక్కలాట మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధాని చేయాలని కొత్త పల్లవి మొదలుపెట్టారు. అయితే అక్కడ ఆంధ్ర పిల్లలు చదవకుండా మోకాలడ్డుతున్నారు. మంచి అవకాశాలను.. అందునా విద్యార్థులకు ఉపయోగపడే అవకాశాలను వీలైంత ఎక్కువకాలం అందిపుచ్చుకోవాలనుకోవడం ఎవరైనా చేసే పని. కానీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినానివ్వదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో ఆంధ్ర స్థానికత ఉన్న విద్యార్థులకు ఉన్న అవకాశాలను చెడగొట్టేశారు. తెలంగాణలో చదవొద్దని హుకుం జారీచేశారు. ‘మీ విద్యార్థులకు అవకాశాలు ఇచ్చేది లేదు’ అని తెలంగాణ సర్కారు చెప్పకముందే జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై విద్యా నిపుణులు విస్తుపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘ఆర్టికల్ 371డీ’ని రాష్ట్ర విభజన తర్వాత కూడా పదేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించారు. దీని ప్రకారం రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 15 శాతం ‘ఓపెన్ కోటా’ అమలవుతోంది.
దీనిని రాష్ట్ర విభజన చట్టంలోని 95డీ సెక్షన్లో చేర్చారు. 2024 జూన్ 2వ తేదీతో విభజన జరిగి పదేళ్లవుతున్న నేపథ్యంలో… రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి దీనిపై సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ, ఉన్నత విద్యాశాఖ, ఆర్థిక, న్యాయ శాఖ, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో భేటీ అయ్యారు. ‘‘సెక్షన్ 95డీని కొనసాగించడం వల్ల ఏపీ విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం లేదని గత ఏడాది డిసెంబరు 12వ తేదీనే సూత్రప్రాయంగా తేల్చేశాం. దీనికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడమా… లేక కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడమా అన్నది నిర్ణయించాలి’’ అంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
దీనిపై అధ్యయనం చేసేందుకు సీఎస్ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పఽశుసంవర్ధక, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, ఆయా రంగాల్లో నిపుణులను సభ్యులుగా నియమించారు.
హైదరాబాద్‌పై ఉన్న శ్రద్ధ… విద్యపై లేదా?
‘పరిపాలనా రాజధాని ఇంకా పూర్తి కాలేదు. అందువల్ల హైదరాబాద్‌ను మరో రెండేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి’ అంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి, ఇంకొందరు జగన్ సన్నిహితులు ఆ మధ్య డిమాండ్ చేశారు. ఉన్న రాజధాని అమరావతిని నాశనం చేసి.. విశాఖ భూములను దిగమింగి.. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ అంటున్నారని జనం విరుచుకుపడేసరికి గప్‌చుప్ అయ్యారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కేంద్రం నోటిఫై చేయడంతోనే ‘ఉమ్మడి రాజధాని’ కథ ముగిసింది. అయినా సరే… విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా హైదరాబాద్‌ను వదులుకోలేమని వైసీపీ పెద్దలు చెబుతున్నారు.
కానీ… తెలంగాణలోని విద్యా సంస్థల్లో మన విద్యార్థులకు దక్కే సీట్లను మాత్రం వదిలేస్తున్నారు. మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి ఎవరి రాష్ట్రంలోని సీట్లను వారే భర్తీ చేసుకోవాలని ఇదివరకే నిర్ణయం జరిగిపోయింది. కానీ… ఇతర విద్యా సంస్థల విషయంలో తెలంగాణతో పోల్చితే ఏపీ ఇంకా వెనుకబడే ఉంది. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ల కోసం ఇప్పటికీ ఏపీ విద్యార్థులు తెలంగాణ వైపే చూస్తున్నారు. ఏపీలో పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా లేకపోవడం ఒక ప్రధాన సమస్య. ఉన్న కొద్దిపాటి మంచి కాలేజీలనూ ఫీజుల్లో కోత, ఇతరత్రా ఆంక్షలతో జగన్ రాచిరంపాన పెడుతున్నారు. విద్యా ప్రమాణాలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఐఐటీ, ఎన్ఐటీల తర్వాత ఏపీకి చెందిన మెరిట్ విద్యార్థులు తెలంగాణలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 15శాతం ఓపెన్ కోటాలో అత్యధికంగా ఏపీ విద్యార్థులే సీట్లు సాధిస్తున్నారు. గత ఏడాది ఏకంగా 40వేల మంది ఏపీ స్థానికత ఉన్న విద్యార్థులు తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం పోటీపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు… 15 శాతం ఓపెన్ కేటగిరీ సీట్లను ‘స్వచ్ఛందం’గా వదులుకునేందుకు ఏపీ ప్రభుత్వమే చర్యలు తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది.
ఎవరు అడిగారని..?
పదేళ్లు పూర్తయినప్పటికీ… కొన్ని ప్రత్యేక పరిస్థితుల రీత్యా మరికొన్నేళ్లు 15 శాతం ఓపెన్ కోటా కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించవచ్చు. దీనికి తెలంగాణ అంగీకరిస్తే మంచిదే. లేకపోతే… దీనిపై కేంద్రాన్ని ఆశ్రయించవచ్చు. అన్నింటికీ మించి… ‘విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్నందున ఎవరి సీట్లు వాళ్లే భర్తీ చేసుకుందాం. మా కాలేజీల్లో మీ విద్యార్థులకు సీట్లు ఇవ్వం’ అని తెలంగాణ చెప్పనే లేదు. మన రాష్ట్రానికి సమాచారమూ ఇవ్వలేదు.
‘మా కాలేజీల్లో సీట్లు మీకు ఇవ్వం’ అని తెలంగాణ చెప్పినట్లు గానీ… ఏపీ విద్యార్థులకు ఇంకొంతకాలం అవకాశాలు కల్పించాలని జగన్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగానీ తాజాగా విడుదల చేసిన గెజిట్‌లో లేనే లేదు. ఇది ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తనంతట తాను వద్దన్నప్పటికీ… ‘మరికొన్నేళ్లు కొనసాగిద్దాం ప్లీజ్’ అని అడగాల్సింది పోయి, తనంతట తానే తలుపులు మూసేస్తుండటం గమనార్హం. ఇది విద్యార్థుల భవిష్యతతో ఆడుకోవడమే.
విద్యార్థులపై ఎందుకీ కక్ష?
జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే జీవో నంబర్ 77 తీసుకొచ్చింది. ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు అందవనేది దీని సారాంశం. ఉన్నత విద్యలో అత్యధిక సీట్లున్నవి, డిమాండ్ ఎక్కువ ఉన్న కాలేజీలు ఎయిడెడ్, ప్రైవేటు రంగంలోనివే. ఆ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్పులు ఇవ్వబోమని ఈ జీవో ద్వారా విద్యార్థుల నెత్తిన పిడుగువేశారు. ఉద్యోగాల కల్పన ఎటూ చేతకాదు… కనీసం విద్యార్థులను ఉన్నత విద్యా కోర్సులను చదువుకోనివ్వరా? నాలుగేళ్ల పాటు విదేశీ విద్యను రద్దు చేసి చివరి ఏడాదిలో ప్రవేశపెట్టారు.
దీని అమలుపై కూడా అనేక సందేహాలు. డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగానే ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని విద్యార్థులకు దేశంలో ఉన్న ఏ కోచింగ్ సెంటర్‌లోనైనా సివిల్స్, రైల్వేస్, ఎస్ఎస్సీ, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలన్నింటికి ఉచితంగా కోచింగ్ తీసుకునే అవకాశం ఉండేది. జగన్ వచ్చాక ఈ పథకం మాయమైపోయింది. అలాగే, టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు టీడీపీ హయాంలో ప్రభుత్వమే ఫీజులు కట్టి వారిని కార్పొరేట్ ఇంటర్ కాలేజీల్లో చదివించింది. జగన్ ఈ పథకం కూడా ఎత్తివేశారు. ఇప్పుడు.. ఏపీలోనే కాదు, హైదరాబాద్‌లో కూడా విద్యార్థులకు చదువుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్త వ్యక్తంచేస్తున్నారు.
పేదల విద్యపై చిన్నచూపు
బటన్ నొక్కే పథకాలు, రాజకీయ లబ్ధి చేకూర్చే కార్యక్రమాలకు కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు గుప్పిస్తున్న జగన్ ప్రభుత్వం.. పేద విద్యార్థుల చదువులపై వివక్ష చూపుతోంది. విద్యా హక్కు చట్టం అమలు గురించి ఎవరికీ తెలియకుండా తూతూమంత్రంగా అడ్మిషన్లు చేపడుతోంది. విద్యాహక్కు చట్టం కింద ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సీటు ఎలా పొందాలి? అనే అంశాలపై అవగాహన కల్పించాలన్న విషయాన్ని పాఠశాల విద్యాశాఖ పూర్తిగా మర్చిపోయింది. కనిపించీ కనిపించకుండా ఒక పత్రికా ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకొంటోంది.
దీంతో విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు పొందే అవకాశం ఉందన్న విషయం ప్రజలకు తెలియడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ విద్యా సంవత్సరంలో 90 వేల సీట్లు అందుబాటులో ఉంటే కేవలం 18,749 మందే సీట్లు పొందారు. 71వేలకు పైగా ఉచిత సీట్లు పేద విద్యార్థులు చేరకుండా మిగిలిపోయాయి. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ చట్టం ద్వారా అడ్మిషన్లు పొందే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రచారం కల్పించకుండా వదిలేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థల్లో 25శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇవ్వాలి. ఆ ఫీజులను ప్రభుత్వం విద్యా సంస్థలకు చెల్లిస్తుంది. విద్యాహక్కు చట్టం ఎప్పుడో అమల్లోకి వచ్చినా రాష్ట్రంలో అమలుచేయలేదు. చివరకు హైకోర్టు ఆదేశాలతో 2022-23 నుంచి అమల్లోకి తెచ్చారు.
అప్పుడు కూడా సరైన ప్రచారం కల్పించకపోవడంతో కేవలం 3శాతం సీట్లే అందులో భర్తీ అయ్యాయి. ఇక 2023-24లో రాష్ట్రవ్యాప్తంగా 90వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ కేవలం ఒకట్రెండు నామమాత్రపు ప్రకటనలు జారీచేసి వదిలేసిన పాఠశాల విద్యాశాఖ ఎక్కడా దానిపై విస్తృత ప్రచారం చేపట్టలేదు. దీంతో 45,372 మంది దరఖాస్తు చేసుకోగా, చివరికి 18,749 మందికి సీట్లు దక్కాయి. ప్రభుత్వం నిర్వాకంతో భారీగా సీట్లు మిగిలిపోయాయి.
అమ్మఒడితో ముడి
విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం పేద విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే సీట్లకు ప్రభుత్వం ఫీజులు చెల్లించాలి. కానీ ఆ ఫీజులకు నిధులివ్వడం ఇష్టంలేని జగన్.. అమ్మఒడి నిధులతో ఆ ఫీజులు కట్టుకోవాలని మెలిక పెట్టారు. అంటే అమ్మఒడి కింద ప్రతిఏటా ఇచ్చే రూ.13 వేలలోనే ఈ ఫీజును చెల్లించుకోవాలని సూచించింది. అందుకోసమే ఫీజులను బాగా తక్కువగా ఖరారు చేసింది. పట్టణాల్లోని పాఠశాలల్లో రూ.8వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100గా నిర్ణయించింది. అయితే ఇది ఆర్టీఈ చట్టానికి వ్యతిరేకమని ప్రైవేటు విద్యా సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ప్రభుత్వం తక్కువే ఖరారు చేసినా కొన్నిచోట్ల యాజమాన్యాలు అనధికారికంగా అదనంగా వసూలుచేస్తున్నాయి. చివరికి అమ్మఒడి పథకం పేరుతో వచ్చిన డబ్బును తల్లులు ఈ రూపంలో చెల్లించాల్సి వస్తోంది.