చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు కీలక వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. వీరిద్దరూ కూడా పార్టీలోను, క్షేత్రస్థాయిలోనూ ఎంతో దూకుడు ఉన్న నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచే వీరిద్దరు జగన్కు ఎంతో అండగా నిలబడ్డారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ధీటుగా పోరాడారు.
ఇక, చెవిరెడ్డి అయితే.. పార్టీలో ఒక రేంజ్లో ఎదిగారు. జగన్ దగ్గర కూడా ఆయన మంచి యాక్సస్ ఉంది. అదేవిధంగా వైఎస్ కుటుంబంతో నేరుగా సంబంధాలు ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా జగన్ దగ్గర మంచి పరపతే సంపాదించుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఇదే జిల్లాలో జరుగుతున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో మాత్రం వీరిద్దరూ ఎక్కడా కనిపించడం లేదు.
ఇటీవల తిరుపతి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి.. నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగా కాకుండా.. అంగరంగ వైభవంగా నిర్వహించాలన్న సీఎం జగన్ సూచనల మేరకు ఏడుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు.. భారీ పరివారంతో గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో భూమన , చెవిరెడ్డి ఎక్కడా కనిపించలేదు.
అయితే.. దీనిపై వివరణగా.. ఈ ఇద్దరు నేతల కార్యాలయాల నుంచి ఆ కార్యక్రమం నెల్లూరులో జరిగింది కనుక మేం పాల్గొనలేకపోయామని.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారంలో పాలు పంచుకుంటామని పేర్కొన్నారు. అయితే.. ప్రచారంలోనూ వీరు ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి భూమన సొంత నియోజకవర్గం తిరుపతి. ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోన్న పార్లమెంటు సీటుకు తిరుపతి కేంద్రంగా ఉంది. ఇక, చెవిరెడ్డి కూడా చంద్రగిరి నుంచి వరుస విజయాలు దక్కించుకుంటున్నారు. చంద్రగిరి తిరుపతిని ఆనుకునే ఉన్నా ఇది చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉంది. అయితే జగన్ చెవిరెడ్డికి కూడా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ, కార్పొరేషన్ సమరంలోనూ ఈ ఇద్దరు నేతలు తమ దైన శైలిలో ముందుకు దూకారు. పార్టీని గెలిపించారు. అయితే.. వీరు సూచించిన వారికి, ముందుగానే వీరు మాట ఇచ్చిన వారికి పదవులు దక్కలేదు.
చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ పదవులు.. సీఎం జగన్ తన అభీష్టం మేరకు స్థానిక పరిస్థితులను గమనించి ఇచ్చారు. దీంతో చెవిరెడ్డి వర్గంలోనూ.. భూమన కుటుంబం సహా ఆయన వర్గంలోనూ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. జగన్ ఇచ్చిన షాక్ నుంచి వీరు ఇంకా కోలు కోలేదు.
ఈ నేపథ్యంలోనే వారు తిరుపతి పార్లమెంటు ఉప పోరు బాధ్యతల్లో ఒకింత నిస్తేజంగా వ్యవహరిస్తున్నాని.. అందుకే దూరంగా ఉంటున్నారని స్థానికంగా పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అయితే వీరు యాక్టివ్గా లేకపోయినా పార్టీ అధిష్టానం నుంచి కీలక నాయకులు మాత్రం.. ఇక్కడ చక్రం తిప్పుతుండడం గమనార్హం.