రమణ దీక్షితులు. తిరుమల శ్రీవారికి రెండేళ్ల కిందటి వరకు ఆయన ప్రధాన అర్చకులు. అయితే.. ఆయన కేవలం పూజలు, కైంకర్యాల వరకే పరిమితమైతే ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? ఆయన గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కానీ, రమణ దీక్షితులు వారి స్టయిలే వేరు. ఒకవైపు శ్రీవారిపై భక్తి ఉన్నట్టుగానే ఆయనకు మరోవైపు.. రాజకీయ నేతలపై కూడా అంతే భక్తి ఉంది. మరీముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ నాయకులన్నా.. రాష్ట్రంలో అప్పటి ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం.. వైసీపీ అన్నా.. రమణ దీక్షితులకు ఎనలేని అభిమానం. కండువా కప్పుకోలేదు కానీ.. అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తారని.. రాష్ట్ర రాజకీయ నేతలు చెప్పుకొంటారు.
ముఖ్యమంత్రి కాకముందు.. ప్రతిపక్ష నేత హోదాలో జగన్ తిరుపతి వెళ్తే.. సర్వం దగ్గరుండి మరీ దీక్షితులు చూసుకునేవారు. అదే సమయంలో అప్పటి అధికార పక్షం టీడీపీపై ఆయన గుర్రుగా ఉంటూ.. తిరుపతికి సంబంధించిన లోపాలను వైసీపీకి ఉప్పందించేవారని.. అధికార పక్షం టీడీపీపై విమర్శలు చేసేవారికి సైతం ఆయన సమాచార సాయం చేసేవారని కూడా అప్పట్లో గుసగుసలు వినిపించేవి. ఈ క్రమంలోనే శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై కూడా అప్పటి అధికార పక్షం, ప్రతిపక్షం నేతల మధ్య తీవ్ర విమర్శలు, సవాళ్లు కూడా జరిగాయి. ఇక, ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం తిరుమల అర్చకులకు సంబంధించి వయోపరిమితిని అమలు చేసింది.
దీంతో అప్పట్లో రమణ దీక్షితులు ప్రధాన అర్చకత్వం కోల్పోయారు. అయితే.. వైసీపీ అధికారంలోకి వస్తే.. టీడీపీ చేసిన తీర్మానం.. ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తానని అప్పట్లో వైసీపీ అధినేత జగన్ స్వయంగా రమణ దీక్షితులుకు హామీ ఇచ్చారు. దీంతో దీక్షితులు .. వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడిచినా.. ఇప్పటికీ తన సమస్య తీర్చకపోవడంపై ఇటీవల ఆయన ఫైరయ్యారు. ఈ క్రమంలో తాజాగా స్పందించిన సీఎం జగన్.. దీక్షితులు కోరిక నెరవేర్చేలా టీటీడీకి ఆదేశాలు జారీచేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలో రిటైర్డ్ అర్చకులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటు అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశించింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకుడి హోదాలో రమణ దీక్షితులు ఆలయ ప్రవేశం చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది. మొత్తానికి జగన్.. దీక్షితులు రుణం తీర్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.