ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అదికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతోంది. నిజానికి ఒక ప్రభుత్వానికి రెండేళ్ల కాలం అంటే.. ఎక్కువనే చెప్పాలి. తొలి ఏడాది తీసేసినా.. రెండో ఏడాది పాలన పరుగులు పెట్టాలి. అయితే.. కొంత మేరకు కరోనా ఎఫెక్ట్ పడిందని సరిపెట్టుకున్నా.. ఎంతో కొంత అభివృద్ది కైతే.. అవకాశం ఉంటుంది.
మరి ఈ నేపథ్యంలో జగన్ సర్కారు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? ఏ ఒక్క ప్రాజెక్టుకైనా.. సీఎం జగన్ శంకుస్థాపన చేశారా? విదేశీ కంపెనీలను ఒప్పించి రప్పించడం, కేంద్ర ప్రాజెక్టులను తీసుకురావడం వంటివి చేశారా? అంటే.. ఏమీ కనిపించడం లేదు. కానీ, వైసీపీ నేతలు మాత్రం మా నాయకుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు కదా! అంటున్నారు.
నిజమే! జగన్ ఇప్పుడు ప్రారంభోత్సవాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. గత ముఖ్యమంత్రి శ్రమటోడ్చి సంపాయించిన ప్రాజెక్టులకు ఇప్పుడు జగన్ తన పేరు తగిలించుకుని ప్రారంభోత్సవాల ముఖ్యమంత్రిగా మిగిలారు. తొలి ఏడాదిలో అనంతపురం కియా కార్ల పరిశ్రమకు రిబ్బన్ కట్ చేశారు. వాస్తవానికి దానిని సాధించేందుకు చంద్రబాబు నానా తిప్పలు పడ్డారు. అయితే.. ఆ శ్రమంతా .. జగన్ ఖాతాలో పడిపోయింది.
ఇక, అదే ఏడాదికి కొద్దిగా అటు ఇటుగా .. విజయవాడలో దుర్గమ్మ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఇది కూడా టీడీపీ నేతల హయాంలోనే కేంద్రాన్ని ఒప్పించి.. అనేక గ్రహణాలను దాటుకుని.. శంకుస్థాపన చేసిందే. కానీ.. దీనిని కూడా జగన్ తన ఖాతాలో వేసేసుకున్నారు.
అదేవిధంగా విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైవోవర్ పరిస్థితి కూడా ఇంతే. ఇక, తాజాగా ఇప్పుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని విమానాశ్రయంలో వాణిజ్య(కమర్షియల్) విమానాల రాకపోకలను జగన్ ప్రారంభిస్తారు. వాస్తవానికి దీని కోసం చంద్రబాబు ఢిల్లీకి తన దూతలను అనేక మార్లు పంపి.. ఈ విమానాశ్రయం రాకపోకలు, విస్తరణకు సంబంధించి అనుమతులు సంపాయించడానికి ప్రయాస పడ్డారు. ఆయన కాలంలోనే మొదలైన రన్ వే విస్తరణ, విమానాశ్రయ అబివృద్ధి వంటివి.. జగన్ సర్కారు హయాంలో పూర్తయ్యాయి.
ఇప్పుడు జగన్ ప్రారంభించి.. దీనిని కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారు. పోనీ.. ఇంత వరకుబాగానే ఉన్నా.. మరి వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం మారేనాటికి(ఎవరు నెగ్గుతారనే విషయం ఇప్పుడే చెప్పలేం కనుక) జగన్ చేసిన శంకుస్థాపనల తాలూకు ప్రారంభోత్సవాల మాటేంటి? అనేది కీలక ప్రశ్న.
ఎందుకంటే.. ఆయన ఇప్పటి వరకు కీలక ప్రాజెక్టుకు దేనికీ(కడప ఉక్కు తప్ప) శంకు స్థాపన చేసింది లేదు.. ప్రణాళికలు సిద్ధం చేసుకున్నదీ లేదు. సో.. మొత్తానికి బాబు కష్టం.. జగన్ ఖాతాలోకి వెళ్లిపోవడం అంటే ఇదే అంటున్నారు పరిశీలకులు.