మళ్లీ వైఎస్సార్ హయాంలో ఉన్న వ్యాపారులంతా ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారని, నాటి వివాదాస్పద వ్యాపారాలను మళ్లీ మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. బీచ్ శాండ్ మైనింగ్ ఏపీఎండీసీ చేపట్టాలనుకుంటున్నా, దాని వెనుక కూడా ఉన్నది నాటి వైఎస్ అనుచరులే అన్నది ఓ ఆరోపణ. అప్పుడెప్పుడో వద్దనుకున్న, సుప్రీం కూడా వద్దని వారించిన బీచ్ శాండ్ మైనింగ్ కు మరోసారి దారులు వెతుకుతుండడమే ఇప్పటి వివాదానికి సిసలు కారణం.
ప్రభుత్వానికి ఇసుక, మైనింగ్ ద్వారానే అధిక ఆదాయం వస్తున్నది. ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం అంతా ఎప్పుడో వైసీపీ నేతల జేబులు నింపేసింది అని, అది కూడా పార్టీ అధిష్టానానికి చెందిన నేతలకే ఎక్కువ మొత్తాల్లో డబ్బులు చేరిపోయాయి అన్నది విపక్షం ఆరోపణ. తరువాత లిక్కర్ వ్యాపారంలో చాలా మంది డాన్ లు డబ్బులు చూశారు. వీళ్లంతా వైసీపీ మనుషులే అని పదేపదే టీడీపీ ఆరోపణలు చేస్తోంది.
ఇప్పుడు తాజాగా బీచ్ శాండ్ కోసం కొన్ని బడా కంపెనీలు తెరపైకి రావడం గమనార్హం. ఈ బ్యాచ్ శాండ్ మైనింగ్ గురించి పర్యావరణ వేత్తలు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటిదాకా బీచ్ శాండ్ మైనింగ్ ను లాభదాయకంగా నడిపి మూడో కంటికి తెలియకుండా ప్లాంట్ మూసి వేసింది ట్రైమాక్స్ మాత్రమే ! ఆ రోజు ట్రై మాక్స్ ప్రసాద్ అప్పటి వైఎస్ అనుచరుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు.
శ్రీకాకుళం, గార మండలంలో ఏర్పాటు చేసిన ఆ ప్లాంటును ఇప్పుడు ఆపేశారు. అక్కడ బీచ్ శాండ్ మైనింగ్ ను నిలిపేశారు. కావాల్సినంతగా ఇసుక నుంచి విలువయిన ఖనిజాలు తవ్వుకుని, ధాతువులు రాబట్టుకుని ఊరు దాటేశారు ట్రైమాక్స్ ప్రసాద్ అని అప్పట్లో ప్రతిపక్షమైన టీడీపీ ఆరోపణలు చేసింది. తాజాగా చాలా రోజుల తరువాత మళ్లీ బీచ్ శాండ్ మైనింగ్ కు అంటే సముద్ర తీరంలో దొరికే ఇసుక నుంచి విలువైన ధాతువులు తీసుకుని వాటిని అమ్ముకోవడంపై ప్రభుత్వం బాగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో కూడా వైసీపీ నేతల స్వార్థమే ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. నిన్నటి ఢిల్లీ టూర్లో కేంద్రానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన విన్నపాల్లో ఇదొకటి కావడం గమనార్హం. ఏపీఎండీసీకి బీచ్ శాండ్ మైనింగ్ ను కేటాయించమని ప్రధాని నరేంద్ర మోడీని అడిగారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తికి తాత్కాలిక ప్రాతిపదికన పది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని వేడుకున్నారు.
బీచ్ శాండ్ మైనింగ్ అన్నది ఏ విధంగానూ పర్యావరణానికి అనుకూలం కాదట. అదేవిధంగా అనుమతులకు మించి ఇసుక తవ్వి కాసులు పిండుకున్న కంపెనీలు బీచ్ శాండ్ మైనింగ్ తరువాత కాలంలో కనీసం స్థానిక ప్రాంతాల అభివృద్ధికి కూడా సహకరించిన దాఖలాలు లేవట. అలాంటపుడు వాటి అవసరమే మాకు లేదు అంటున్నారు స్థానికులు. తాజాగా సీఎం చొరవతో బీచ్ శాండ్ మైనింగ్ అన్నది మొదలయితే వైఎస్సార్ అనుయాయులకు పెద్ద పండుగే అని తెలుగుదేశం నేతలు విమర్శలు చేస్తున్నారు.
Comments 1