ఏపీ మాజీ సీఎం జగన్.. తన తల్లి, చెల్లిపై వేసిన కేసు విచారణ వాయిదా పడింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన కేసులో విచారణ వచ్చే నెల 13వ తేదీ వరకు నిలిచిపోయింది. ఈ సంస్థకు చెందిన షేర్లను తన తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలలు తనకు తెలియకుండానే బదిలీ చేసుకుని విక్రయించే ప్రయత్నం చేశారని.. గత సెప్టెంబరులోనే జగన్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో కేసు వేశారు.
తనను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టేందుకు, ఇరుకున పెట్టేందుకు ఇలా చేశారని,… ఈ నేపథ్యంలో తనకే 51.01 శాతం వాటా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా కోరారు. అదేసమయంలో తనకు ప్రస్తుతం చెల్లి షర్మిలపై ప్రేమ తగ్గిపోయిందని.. ఆమె తన శత్రువులతో చేతులు కలిపి తనపై కుట్ర చేస్తున్నారని కూడా జగన్ ఆరోపించారు. ఇది పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసింది. సుమారు రెండు వారాల పాటు ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కూడా కుదిపేసింది.
సెప్టెంబరులో జగన్ దాఖలు చేసిన కేసును విచారణకు తీసుకున్న నేషనల్ కంపెనీ లాట్రైబ్యేనల్.. కొన్నాళ్ల కిందటే విజయమ్మ, షర్మిలలకు నోటీసులు పంపించింది. వారి వాదన వినిపించాలని కూడా కోరింది. వాస్తవానికి శుక్రవారం నాటి విచారణకు షర్మిల, విజయమ్మలు కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది. కానీ.. అనివార్య కారణాల నేపథ్యంలో కౌంటర్లు దాఖలు చేయడానికి రెండు వారాల సమయం కోరారు. దీంతో కోర్టు వచ్చే నెల 13వ తేదీకి కేసును వాయిదా వేయడం గమనార్హం.