మాజీ ఎంపీ. పైగా 80+ వయసు. దాదాపు మంచంలోనే అన్నీ. అయినా.. కూడా ఆయన రెచ్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనపై ఆచి తూచి వ్యవహరించాల్సిన ఆయన.. చిచ్చు పెట్టేలా.. జనసేన కార్యకర్తలు రెచ్చిపోయేలా.. ముఖ్యంగా కాపు ఓటు బ్యాంకు చీలిపోయేలా `రాజకీయాలు` చేస్తున్నారు. కాపీ..టు పీఎం, కాపీ.. టు సీఎం.. అన్నట్టుగా ఎడం చేత్తో ఒక లేఖ, కుడి చేత్తో మరో లేఖ సంధిస్తూ.. రచ్చ రేపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనే నరసాపురం మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య. ప్రస్తుతం ఆయనేమీ జనసేన పార్టీ సభ్యుడు కాదు. సలహాదారు అంతకన్నా కాదు. పైగా.. తనకంటూ. ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకున్నారు.
`కాపు సంక్షేమ సేన`- పేరుతో చేగొండి హరిరామజోగయ్య కాపులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, కురువృద్ధుడు కావడంతో పవన్ కళ్యాణ్ ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. కాపులకు రిజర్వేషన్ అమలు కోసం ఉద్యమించారన్న మంచితనంతో ఆయనను పలకరిస్తున్నారు. అయితే.. దీనిని అలుసుగా తీసుకున్నారో.. లేక పవన్ మంచితనాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నారో.. ఇవన్నీ.. కాక.. అధికార పార్టీ నేతల తెరవెనుక రాజకీయంలో ఒక పావుగా మారారో తెలియదు కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కంట్లో నలుసుగా, చెప్పులో రాయిగా.. మారిపోయారు.
తరచుగా పవన్‌కు లేఖలు సంధిస్తూ.. జోగయ్య వార్తల్లో నిలుస్తున్నారు. పోనీ.. ఈ లేఖల్లోఏమైనా సూచనలు, సూక్తులు ఉన్నాయా? కలివిడిగా ముందుకు సాగడం ద్వారా..ఎన్నికల్లో వ్యూహాత్మకంగా యుద్ధం చేసి విజయం సాధించేందుకు అవసరమైన సరుకును ఏమైనా పంచుకుంటున్నారా? అంటే అది కూడా లేదు. కేవలం.. కాపులను పవన్‌కు దూరం చేసే పెద్ద క్రతువును ఈ కురువృద్ధుడు భుజాలపై వేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఒక లేఖలో ఏదో విమర్శించారంటే అనుకోవచ్చు.. ఇక, రాసిన ప్రతిలేఖలోనూ విమర్శలు.. వెక్కిరింతలే కనిపిస్తున్నాయి.
కాపులు నిన్ను నమ్ముకున్నారు. వారికి అన్యాయం చేస్తావా.. అంటూ.. మొదలైన ఈ లేఖల పరంపర.. మోసం చేస్తున్నావం టూ ముగించే స్థాయికి చేరుకుంది. కాపులు మొత్తం నీపైనే ఆశలు పెట్టుకున్నారని.. వారి జవం.. జీవం కూడా నువ్వేనని గత లేఖల్లో మంట పుట్టించేలా వ్యాఖ్యానించారు. కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే పార్టీతోనే జట్టుకట్టాలన్నారు. అసలు నీకు పొత్తులు ఎందుకంటే.. ఒక సందర్భంలో విరుచుకుపడ్డారు. తర్వాత తర్వాత.. టోన్ మార్చి.. నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే..చూడాలని కాపులు తపిస్తున్నారని అన్నారు. తాజాగా రాసిన లేఖలో.. సీట్ల వ్యవహారంపై నిప్పులు చెరిగారు. 24 వాళ్లు ఇస్తే.. నువ్వు తీసుకోవడం ఏంటన్నారు.
సీఎం పీఠాన్ని రెండున్నరేళ్లు తీసుకునేలా చంద్రబాబుతోనే మాట చెప్పించాలని జోగయ్య తన లేఖలో డిమాండ్ చేశారు. అంతేకాదు.. పదవుల్లోనూ సగం సగం.. ఇచ్చేలా ఒప్పందం చేసుకోవాలన్నారు. ఒకవైపు.. పవన్ .. మనకు బలం లేదు. మన తరఫున ఇప్పుడు ఓ పది మంది ఎమ్మెల్యేలు ఉంటే.. ఖచ్చితంగా 50 సీట్లు తీసుకునేవాడినని చెబుతున్నారు. అయినా..ఎక్కడా ఈయన మాటలు లెక్కచేయడం మానేసి.. ఒక ట్రాప్‌లో పడినట్టుగా జోగయ్య యాగీ చేయడం గమనార్హం. పరిశీలకుల అంచనా ప్రకారం.. ఈయన జగన్ పక్షం ట్రాప్‌లో పడ్డారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెరచాటున జరుగుతున్న `జగన్నాటకం`లో ఈయన సమిధగా మారారా? అనే ప్రశ్నలుతెరమీదకి వస్తున్నాయి. సీనియర్‌గా.. కురువృద్ధుడిగా, భీష్మపితామముఢిగా.. టీడీపీ-జనసేనలో తలెత్తిన టికెట్ల వ్యవహారంలో సర్దుబాటు వ్యాఖ్యలు చేయడం ద్వారా.. పరిస్థితిని చక్కదిద్దాల్సిన చేగొండి యాగీ వెనుక `ఏదో` ఉందనే సందేహాలు ముసురుకున్నాయి. మరోవైపు.. చేగొండి గ్రాఫ్ ఎంత అని చూస్తే..ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.