రీల్ స్టోరీకి మించిన రియల్ స్టోరీలు అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటాయి. కాకుంటే.. తారాపథంలో దూసుకెళ్లే ఒక బాలీవుడ్ బ్యూటీ బాధితురాలిగా మారటం ఈ ఎపిసోడ్ లో అసలు ట్విస్టు. మెరిసే అందం ఆమె సొంతం. ఆమే.. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. ఈ కేసు విచారణ కోసం పలుమార్లు హాజరయ్యారు. ఆర్థిక నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిందన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. జాక్వెలిన్ కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఖరీదైన బహుమతులతో జాక్వెలిన్ మనసును దోచేయటమేకాదు.. తన కలల రాకుమారుడు కూడా ఈ ఆర్థిక నేరస్తుడే అన్నట్లుగా ఆమె ఫీలయ్యేదని.. ఒక దశలో అతడ్ని పెళ్లి చేసుకోవటానికి రెఢీ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. సుకేశ్ కు జాక్వెలిన్ మానసికంగా ఎంతో దగ్గరైందని చెబుతున్నారు. ఆమెను ఆకట్టుకునేందుకు సుకేశ్ చేసిన ప్రయత్నాలు.. అనుసరించిన మార్గాల్ని చూస్తే.. ఆమెను ట్రాప్ చేశారన్న భావన బలంగా కలగటం ఖాయం.
జాక్వెలిన్ ను ఆకట్టుకునేందుకు సుకేశ్ ఆమెకు రూ.10 కోట్ల విలువ చేసే అత్యంత విలువైన కానుకలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అందులో మినీ కూపర్ కారు మొదలు కొని డైమండ్స్ జ్యూయలరీ.. ఖరీదైన సూట్లు.. బ్యాగులు ఇలా ఎన్నింటినో ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇంతగా తన ట్రాప్ లో చిక్కుకునేలా చేసిన సుకేశ్ కు సంబంధించిన మోసాలపై ఒక వార్తా కథనాన్ని చదివి షాక్ తిన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు తెలిపినట్లుగా ఒక కథనం బయటకు వచ్చింది.
అంతేకాదు.. జాక్వెలిన్ ను పరిచయం చేసుకోవటం కోసం సుకేశ్.. పింకీ ఇరానీ అనే మహిళకు సైతం భారీగా డబ్బు ముట్టజెప్పిన వైనం బయటకు వచ్చింది. సుకేశ్ యవ్వారాలు బయటకు వచ్చిన వేళ.. అతడ్ని తనకు పరిచయం చేసిన పింకీ ఇరానీని జాక్వెలిన్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఒక ప్రముఖ హీరోయిన్ ను ప్లాన్ చేసి మరీ ట్రాప్ చేసి.. ఆమెకు అత్యంత సన్నిహితుడిగా మారటం.. అతడ్ని పెళ్లి చేసుకోవటానికి ఆమె సైతం సిద్ధం కావటం లాంటివి చూస్తే.. రీల్ కథకు ఏ మాత్రం తీసిపోని రియల్ స్టోరీగా అనిపించకమానదు.