భారతీయ సినీ చరిత్రలో విషయ ప్రధానంగా ఉంటూనే కమర్షియల్ హంగులతోనూ మెప్పిస్తూ బ్లాక్‌బస్టర్ అయి ట్రెండ్ సెట్ చేసిన సినిమాల జాబితా తీస్తే అందులో ‘జెంటిల్‌మ్యాన్’ కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ డైరెక్టర్ శంకర్ తొలి చిత్రమిది. దీని తర్వాత శంకర్ ఇంతింతై అన్నట్లు దర్శకుడిగా ఎలా ఎదిగిపోయాడో, ఎలాంటి సినిమాలు తీశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఈ తమిళ చిత్రం తెలుగులోకి అనువాదమై ఇక్కడా ఘనవిజయాన్నందుకుంది. తర్వాత చిరంజీవి హీరోగా హిందీలో రీమేక్ చేస్తే అక్కడా బాగా ఆడింది. ఐతే ఆ సినిమా వచ్చిన మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు దానికి సీక్వెల్ రెడీ అవుతోంది.
మామూలుగా అయితే ఇలాంటి సీక్వెల్స్ దర్శకులే పట్టాలెక్కిస్తుంటారు. కానీ ఈ కొత్త ప్రాజెక్టులో శంకర్ భాగస్వామి కాదు. ‘జెంటిల్‌మ్యాన్’ చిత్రాన్ని నిర్మించిన అప్పటి అగ్ర నిర్మాత కేటీ కుంజుమోన్‌ను ‘జెంటిల్‌మ్యాన్-2’కు సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ముందుగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణిని, ఆ తర్వాత కథానాయికగా నయనతారను ప్రకటించడం తెలిసిందే. ఐతే సినిమాకు అత్యంత కీలకం అయిన దర్శకుడు, హీరో సంగతే ఆయన తేల్చలేదు. ఈ విషయంలో నాన్చుతూ వచ్చిన కుంజుమోన్.. ఎట్టకేలకు దర్శకుడి విషయంలో సస్పెన్సుకి తెరదించాడు.
గతంలో నాని హీరోగా ‘ఆహా కళ్యాణం’ లాంటి డిజాస్టర్ తీసిన గోకుల్ కృష్ణను ‘జెంటిల్‌మ్యాన్-2’కు దర్శకుడిగా ఎంచుకోవడం ద్వారా ఈ ప్రాజెక్టు మీద ఉన్న ఆసక్తిని తగ్గించేశాడు. ‘ఆహా కళ్యాణం’ బాలీవుడ్ మూవీ ‘బ్యాండ్ బాజా బారత్’కు రీమేక్. పైగా అది డిజాస్టర్ అయింది. ఆ తర్వాత అతనేమీ సినిమాలు తీసినట్లు లేడు.
‘జెంటిల్‌మ్యాన్-2’ను శంకర్ తీయకపోయినా.. కనీసం కాస్త పేరున్న, మంచి ట్రాక్ రికార్డున్న డైరెక్టర్ తీస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ దానికి భిన్నంగా గోకుల్‌ను దర్శకుడిగా ప్రకటించడం అందరూ నీరుగారిపోయారు. ఇక హీరో విషయంలో కుంజుమోన్ ఛాయిస్ ఎలా ఉంటుందో చూడాలి మరి.