ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసి పేదల ఇంటి కలను నెరవేరుస్తున్నామని జగన్ సర్కార్, వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, వైసీపీ నేతల రికమండేషన్లు ఉన్నవారికే పట్టాలు అందాయని విమర్శలు వస్తున్నాయి. పేదలకు ఇళ్ల పండగని చెప్పిన వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. పేదలకది సెంటు స్థలం అని కానీ, జగన్‌రెడ్డికి, వైసీపీ ఎమ్మెల్యేలకు అది కుంభస్థలం అని విమర్శించారు. స్థల సేకరణలో అవినీతి, చదును పేరుతో దోపిడీ, పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చారని మండిపడ్డారు. పేదల పేరుతో జగన్‌రెడ్డి రూ.6,500 కోట్లు ‘త్రీ ఇన్ వన్’ స్కాం చేశారని దుయ్యబట్టారు.
జగన్ పై లోకేష్ పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఇళ్ల స్థలాల పంపిణీ ముసుగులో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లకు నీలం రంగు వేసినంత మాత్రాన సైకిల్ బ్రాండ్ చెరిగిపోదన్నారు లోకేష్. ‘‘నీ కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువగా ఉన్న ఇళ్లలో, కొండలు, గుట్టలు, శ్మశానాలు, చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదు’’ అని జగన్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. ఇప్పుడున్న ఆధారాలతో ‘జగనన్న జైలు పిలుస్తోంది’ పథకంలో భాగంగా 41 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైల్లో జగన్‌రెడ్డితో పాటు చిప్పకూడు తినడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇళ్ల స్థలాల కోసం కొన్న భూముల్లో వైసీపీ నేతల మేతపై దమ్ముంటే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.