నిత్యం.. ప్రజల్లోకి వెళ్లి నాయకుడిగా.. నిత్యం ప్రజల్లోనే ఉండే నాయకుడిగా చంద్రబాబు మరోసారి పేరు తెచ్చుకున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి అంటే కార్యాలయాలకు, సమీక్షలకు మాత్రమే పరిమితం అవుతారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ కార్యక్రమాల పరంగా బయటకు వచ్చి, జనంతో మమేకం అవుతారు. అంతకుమించి మాత్రం పెద్దగా ఆసక్తి చూపరు. సాధారణంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండే వారికి భద్రతాపరమైన సమస్యలు, అదేవిధంగా వ్యక్తిగత సమస్యలు కూడా వెంటాడుతాయి.
దీంతో నాయకులు నేరుగా ప్రజలను కలుసుకున్నందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమయం కూడా సరిపోదని భావిస్తారు. జగన్మోహన్ రెడ్డి హయంలో అసలు ప్రజల్లోకి రాకపోవడం మనకు తెలిసిందే. వచ్చి నా పరదాలు కట్టుకుని చెట్లు కొట్టించేసి ప్రత్యర్థులను గృహ నిర్బంధాలు చేసి ఆయన ప్రజల్లోకి వచ్చారు. అప్పుడు కూడా సభకి జనాలకి మధ్య దాదాపు ఒక 200 అడుగుల దూరం పెట్టి ఆయన మాట్లాడిన సంద ర్భాలు మనకు గుర్తుండే ఉంటుంది. కానీ, దీనికి విరుద్ధంగా దేశంలోని అందరు ముఖ్యమంత్రుల కంటే కూడా చంద్రబాబు ప్రజలను చేరుకోవడంలోముందున్నారు.
ప్రజలకు చేరువు కావడంలో చాలా ఉత్సాహంగా ఉన్నారనేది తాజాగా జాతీయ మీడియా చెబుతున్న మాట. వాస్తవానికి చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్నారు. అంటే ఇది అత్యున్నత స్థాయి భద్రత. ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని భావించిన నాయకులకు మాత్రమే ఈ తరహా భద్రతను కల్పిస్తారు. మరి అంత భద్రతలో ఉండి కూడా చంద్రబాబు మాత్రం ప్రజలను కలుసుకునేందుకు చాలా ఉత్సాహంగా ఉండటం ప్రజలను నేరుగా కలుసుకోవడం వంటివి ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గడిచిన రెండు మాసాల కాలంలో ఇప్పటికి చంద్రబాబు మొత్తంగా ఆరుసార్లు ప్రజల మధ్యకు వచ్చారు. ప్రతి నెల రెండుసార్లు 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేసేందుకు వచ్చారు. తర్వాత ప్రజా దర్బార్ పేరుతో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత గ్రామ సభలోను చంద్రబాబు దూకుడుగా ముందుకు వెళ్లారు. ఇలా తన భద్రతను లెక్కచేయకుండానే చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లడం, ప్రజానేతగా ఆయనకు మంచి గుర్తింపు అయితే తీసుకొచ్చింది. ఇదే ఇప్పుడు జాతీయ మీడియా చెబుతున్న మాట. దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి లేడని కూడా చెప్పడం విశేషం.