ఏపీలో చెత్త పన్ను మొదలు విద్యుత్ చార్జీల వరకు జగన్ వీర బాదుడుకు జనం బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. జనం నడ్డి విరిచేలా జగన్ నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలను పెంచుకుంటూ పోతున్నారని విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక, ఇసుక, మద్యం వంటి వాటితో జరిగే దోపిడీ దీనికి అదనమని, జగన్ విధానాలతో ప్రతి కుటుంబంపై ఏడాదికి హీనపక్షం రూ.1 లక్ష భారం పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు గణాంకాలతో సహా గతంలో విశ్లేషించారు.
జగన్ బాదుడేబాదుడుతో ప్రజలు విలవిలలాడిపోతున్నారని, జగన్ చేసే అప్పుల కోసం జనం జేబులకు చిల్లుపడుతోందని మండిపడ్డారు. పథకాల పేరుతో ప్రజల నుంచి పిండిన దాంట్లో 10 శాతాన్ని ప్రజలకు ఇచ్చి మిగిలిన 90 శాతాన్ని జగన్ తన జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఇక, జగన్ అప్పులు…వాటికోసం పడుతున్న తిప్పలపై కాగ్ మొదలు జాతీయ మీడియా వరకు అన్ని వార్నింగ్ ఇచ్చాయి. అయినా సరే జగన్ అప్పుల దాహం తీరడం లేదు. ఓటీఎస్ అంటూ ఇళ్లపై పడ్డ జగన్…తాజాగా మరో బాదుడుకు రెడీ అయ్యారు.
ఇంపాక్ట్ ఫీజు పేరుతో తనకు ఒక్క చాన్స్ ఇచ్చిన జనం నడ్డివిరిచేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఇకపై, కొన్ని ప్రాంతాలలో రహదారుల పక్కన ఇళ్లు కట్టుకుంటే ఆ ఫీజు పేరుతో బాదేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. నగరాలు, పట్టణాలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో 60 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్న రహదారుల పక్కన కొత్తగా భవనాలు నిర్మించే వారికి ఈ వడ్డింపు వేశాడు జగనన్న.
అంతేకాదు, ఆల్రెడీ జనం కడుతున్న లైసెన్స్ ఫీజులు, ఇతర చార్జీలకు ఈ ఇంపాక్ట్ ఫీజు అదనం అన్నమాట. ఈ ప్రకారం పురపాలక శాఖ అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆల్రెడీ ఉన్న రహదారులతోపాటు నిర్మాణంలో ఉన్న రహదారులు, కొత్తగా రహదారుల నిర్మాణానికి భూసేకరణ దశలో ఉన్న చోట కూడా ఈ ఇంపాక్ట్ ఫీజు కట్టాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది.
60 అడుగులు, ఆపైన.. 150 అడుగులు వెడల్పున్న రహదారుల్ని ఆనుకుని నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాలకుకూడా ఇది వర్తిస్తుందట. 150 అడుగులు, అంతకుమించి వెడల్పు ఉన్న రహదారులకు రెండు పక్కలా 250 మీటర్ల దూరం వరకు నిర్మించే అన్ని రకాల భవనాలకు ఇంపాక్ట్ ఫీజు చెల్లించాల్సిందేనట. బిల్డప్ ఏరియాలో ప్రతీ చదరపు అడుగుకు ఇంత మొత్తం రుసుము అని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి స్థలం రిజిస్ట్రేషన్ విలువలో రెండు నుంచి మూడు శాతం లేదా ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దానిని వసూలు చేస్తారు.