జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర అన్ని అడ్డంకులను అధిగమించి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రేషన్ మాఫియా పై పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాల విడుదల సమయంలో కక్షపూరితంగా టికెట్ ధరలు తగ్గించాలని పవన్ ఆరోపించారు. అంతేకాకుండా, థియేటర్లపై ఆంక్షలు విధించడం, అధికారులను మోహరించి థియేటర్ల యజమానులను ఇబ్బంది పెట్టడం వంటివి చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ చేసినటువంటి పనుల వల్ల తన సినిమాలు హిట్ అయినా నిర్మాతలకు నష్టాలు వచ్చాయని పవన్ ఆరోపించారు. ఏపీలోనే నిర్మాతలకు దాదాపుగా 30 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని, ఆ నష్టాన్ని తానే భరించాల్సి వచ్చిందని పవన్ వాపోయారు. వకీల్ సాబ్ చిత్రం విడుదల సమయంలో ఏపీలో బెనిఫిట్ షో, స్పెషల్ షోలపై ప్రభుత్వం నిబంధనలు విధించిందని ఆరోపణలు చేశారు. అంతేకాదు, వాటికి సంబంధించి టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వకుండా ప్రత్యేకంగా జీవో ని కూడా ప్రభుత్వం తీసుకురావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు సీఎం జగన్ దగ్గరికి వెళ్లి చర్చలు జరపడంతో టికెట్ ధరలు కొంచెం పెంచిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఆ వ్యవహారంపై కూడా జగన్ ను పవన్ విమర్శించారు. చిరంజీవి వంటి పెద్దమనిషిని తన ముందు చేతులు కట్టుకునే లాగా జగన్ చేశారని పవన్ వారాహి యాత్రలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కాగా, టాలీవుడ్ లోని కొందరు హీరోలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్ తన కంటే పెద్ద హీరో అని స్టార్ అని పవన్ ప్రశంసించారు. ఇక, మహేష్ బాబు కూడా తనకన్నా పెద్ద హీరోనే అని, తనకంటే పారితోషికం కూడా ఎక్కువగానే తీసుకుంటారని పవన్ చెప్పారు.
చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అని, కానీ తాను మాత్రం ఎవరికీ తెలియదని అన్నారు. అందరి హీరోల సినిమాలు చూస్తానని, ఇష్టపడతానని, తనకు ఎలాంటి ఇగో ఫీలింగ్స్ లేవని పవన్ అన్నారు. అయితే, సినీ హీరోల మీద ఉన్న అభిమానాన్ని రాజకీయాలలోకి తేవద్దని పవన్ హితవు పలికారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం హీరోల అభిమానులంతా తనకు అండగా ఉండాలని పవన్ విజ్ఞప్తి చేశారు.