టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫుంగనూరు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు పుంగనూరు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. చంద్రబాబు రాకుండా రోడ్డుకు అడ్డంగా లారీలు, వాహనాలను పోలీసులు నిలపడంతో టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. దీంతో, టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసి భాష్పవాయువును ప్రయోగించారు. పోలీసులు గాల్లోకి కూడా కాల్పులు జరిపారని తెలుస్తోంది.
పోలీసుల వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయగా…టీడీపీ నేతలకు చెందిన 20 కార్ల అద్దాలను కొందరు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే అంగళ్లు నుంచి పుంగనూరుకు చంద్రబాబు ఓపెన్ టాప్ వాహనంపై నిల్చోని ర్యాలీగా బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే ఈ అల్లర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. తాను పుంగనూరు రోడ్డుపై తిరగకూడదా? ఆ రోడ్డు మీ తాత జాగీరా? అని పెద్దిరెడ్డిపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు తిరగబడితే మీరు పారిపోతారంటూ పెద్దిరెడ్డిని హెచ్చరించారు.
నెత్తురోడుతున్నా లెక్కచేయకుండా ధైర్యంగా నిలబడిన కార్యకర్తలను అభినందించారు. వారిని తన వాహనంపైకి పిలిపించుకొని ధైర్యం చెప్పారు. కార్యకర్తల ఒంటి నుంచి కారిన ప్రతి రక్తపు చుక్క తన ఒంటి నుంచి కారినట్టేనని అన్నారు. చల్లా బాబుపై దెబ్బ పడితే చంద్రబాబుపై పడినట్టే అని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మొన్న పులివెందులలో పొలికేక వినిపించానని, పుంగనూరులో గర్జిస్తున్నానని చెప్పారు. అధికార పార్టీకి పోలీసులు దాసోహం కావొద్దని, ఇవాళ్టి ఘటనలకు ఎస్పీనే బాధ్యుడు అని అన్నారు.
తాను మళ్లీ పుంగనూరు వస్తానని, పుంగనూరు పట్టణమంతా పర్యటిస్తానని పెద్దిరెడ్డికి సవాల్ విసిరారు. ఈ విధ్వంసానికి కారణం పెద్దిరెడ్డేనని, పోలీసుల పాత్ర కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్యే రావణాసురుడు అని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. తనది చిత్తూరేనని, పెద్దిరెడ్డి పతనం అంగుళ్ల నుంచి ప్రారంభమైందని హెచ్చరించారు. డీఎస్పీీ తన యూనిఫాం తీసేయాలని, పోలీసుల అండతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.