సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలను తెలంగాణ హైకోర్టు బ్రేకలు వేసింది. గురువారం అర్థరాత్రి 11.30 గంటల వేళలో ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జారీ చేసిన సెన్సార్ సర్టిఫికేట్ ఆధారంగా సినిమాను విడుదల చేయొద్దని రామదూత క్రియేషన్స్.. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లకు ఆదేశాలు జారీ చేసింది.
ఇక.. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టను దెబ్బ తీసేలా ఈ సినిమాను రూపొందించారని.. దాన్ని కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించటాన్ని సవాలు చేస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద గురువారం విచారణ చేపట్టారు. ఉదయం 11.45 గంటల నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ వాదనల్ని విన్న న్యాయమూర్తి.. అర్థరాత్రి 11.30 గంటల వేళలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికేట్ ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
నారా లోకేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు.. ఉన్నం శ్రవణ్ కుమార్ లు వాదనలు వినిపించగా.. నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ట్రయలర్ ను చూసి కోర్టును ఆశ్రయించటం సరికాదని.. సినిమాను నిలిపివేయాలని కోరటం కరెక్టు కాదని వాదించారు. సెన్సార్ బోర్డు తరఫున అదనపు ఏజీ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ.. ఒకసారి బోర్డు సర్టిఫికేట్ జారీ చేశాక.. కోర్టులు జోక్యం చేసుకోరాదని వాదనలు వినిపించారు.
ఈ మూవీకి ప్రాంతీయ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వటానికి నో చెప్పగా.. ఛైర్మన్ ద్వారా రివిజనల్ కమిటీకి సిఫార్సు చేశారన్నారు. పది మందితో కూడిన కమిటీ సినిమాను పరిశీలించి కొన్ని అంశాల్ని తొలగించాలన్న సూచన చేయటం తోపాటు కొన్ని సంభాషణల్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కక్ష సాధింపు సినిమాలు తీయటం సరికాదన్నారు. చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బ తీయాలని నిర్మాత.. దర్శకుడు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
గతంలో ఐదారు సినిమాలు తీసినా.. వాటితో ఎలాంటి లాభాలు రాకున్నా మళ్లీ ఇదే తరహా సినిమాల్ని తీస్తున్నారన్నారు. దీనికి ఒక నేత నుంచి ఆర్థిక సాయం అందుతున్నట్లుగా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బ తీయటమే లక్ష్యంగా చేసుకున్నారని వాదనలు వినిపించారు. రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని నిర్మించి.. తమ పరువు తీయటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. అంతేకాదు.. ఈ సినిమాలో నేరుగా పేర్లు పెట్టారని.. వ్యక్తి గౌరవ ప్రతిష్ఠలను ప్రాధాన్యం ఉంటుందని సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల్ని జడ్జి మెందుకు తీసుకువచ్చారు. న్యాయవాదుల వాదోపవాదాల అనంతరం హైకోర్టు జడ్జి చిత్ర విడుదలను నిలిపివేస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు.