ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అధికారులను, ఉద్యోగులను బెదిరించేలా వ్యాఖ్యలు, నిమ్మగడ్డపై రాజకీయ విమర్శలే కాకుండా వ్యక్తిగత విమర్శలు చేసిన పెద్దిరెడ్డిపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డిని ఈనెల 21వరకు హౌస్ అరెస్ట్ చేయాలని, మీడియాతో మాట్లాడకుండా నియంత్రించాలని డీజీసీ సవాంగ్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు.
అయితే, దీనిపై పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లగా….ఆయన ఇంటినుంచి బయటకు వెళ్లవచ్చని, అయితే, ఎన్నికలు ముగిసేవరకు పెద్దిరెడ్డి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని, మీడియాతో మాట్లాడవద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో పెద్దిరెడ్డి సవాల్ చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు…పెద్దిరెడ్డికి మరో షాకిచ్చింది.
పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడవచ్చని, కానీ, నిమ్మగడ్డపై వ్యక్తిగత దూషణలకు దిగకూడదని హైకోర్టు తాజాాగా ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గించకూడదని, ఇచ్చిన అండర్ టేకింగ్‌కు కట్టుబడి ఉండాల్సిందేనని కోర్టు తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ పూర్తయ్యేవరకు కోర్టు నియమాలు పాటించాల్సిందేనని ఆదేశించింది. తాజా తీర్పుపై పెద్దిరెడ్డి స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.